బ్రిటన్ లో చదువుకు వెళ్తున్నారా ? అకౌంట్లో నెలకు రూ 1.64 లక్షలు ఉండాల్సిందే..!
విదేశీ విద్యార్ధులకు బ్రిటన్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చి యూకేలో చదువుకుంటున్న విద్యార్ధులకు తమ సేవింగ్ ఖాతాల్లో ఉండాల్సిన నిల్వ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత 11 శాతం మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై బ్రిటన్ లో చదువుకునే విద్యార్ధులు నిర్దేశిత మొత్తాన్ని తమ సేవింగ్ ఖాతాల్లో చూపించుకోవాల్సిందే.
బ్రిటన్ లో విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్ధులకు స్ధానికంగా ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేలా నిబంధనలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత విదేశీ విద్యార్ధుల బ్యాంక్ బ్యాలెన్స్ కనీస మొత్తాన్ని పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విదేశీ విద్యార్ధులు తమ సేవింగ్ అకౌంట్లో బ్రిటన్ కరెన్సీలో 1483 పౌండ్లు కనీసం ఉండేలా చూసుకోవాలి. ఇండియా కరెన్సీలో ఇది 1.64 లక్షలకు సమానం.

ఇప్పటివరకూ 1334 పౌండ్లుగా ఉన్న ఈ కనీస నిల్వ మొత్తాన్ని 1483 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్ధులు తప్పనిసరిగా ఇంత మొత్తాన్ని తమ అకౌంట్లలో చూపించుకోవాల్సిందే. లేకపోతే విద్యాభ్యాసం కొనసాగించడానికి అనుమతించరు. దీంతో ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్ధుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం మాత్రం స్దానిక పరిస్ధితులకు అనుగుణంగా విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెబుతోంది.












Click it and Unblock the Notifications