ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు 3 సార్లు ప్రయత్నించిన రష్యా ప్రైవేటు సైన్యం: తిప్పికొట్టిన దళాలు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దళాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భారీ స్థాయిలో వైమానికి దాడులతో అనేక మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేగాక, ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్క్సీని అంతం చేసేందుకు కూడా రష్యా సేనలు పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, ఉక్రెయిన్ బలగాలు తమ దేశాధ్యక్షుడిని కాపాడుకుంటున్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు కీవ్‌కు రష్యా ప్రైవేట్ సైన్యం
ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపేందుకు వందల మంది ప్రైవేటు సైన్యం కీవ్ నగరంలోకి అడుగుపెట్టిందనే వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపేందుకు క్రెమ్లిన్ మద్దతున్న వాగ్నర్ గ్రూప్‌తో చెచెన్ స్పెషల్ ఫోర్స్ పలుమార్లు ప్రయత్నించినట్లు తాజాగా లండన్ వేదికగా ఉన్న ఓ అంతర్జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. కీవ్‌లో మాటువేసిన వాగ్నర్(రష్యాకు చెందిన పారామిలిటరీ ప్రైవేటు సైన్యం) గ్రూప్ నకు చెందిన సాయుధ దళాలు ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపింది.

రష్యా ప్రైవేట్ సైన్యాన్ని హతమార్చిన ఉక్రెయిన్ బలగాలు
ఈ క్రమంలోనే వాగ్నర్ సమూహంలోని కొందరు రష్యా ప్రైవేటు సైనికులు హతమైనట్లు వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, చెచెన్ ప్రత్యేక దళాలు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపేందుకు ప్రయత్నించినట్లు ఆ దేశ జాతీయభద్రతా, రక్షణ మండలి కార్యదర్శి ఒలెక్సీయ్ డానివోల్ తెలిపారు. అప్రమత్తమైన ఉక్రెయిన్ దళాలు వారిని ధీటుగా ఎదుర్కొన్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధ్యక్షుడిపై దాడికి సంబంధించి ఇంటెలిజెన్స్ అప్రమత్తతో కుట్రను భగ్నం చేశామని తెలిపారు. ఈ ఘాతుకానికి సంబంధించి యుద్ధాన్ని వ్యతిరేకించే రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసస్(ఎప్ఎస్బీ)లోని కొన్ని వర్గాలు తమకు ముందు సమాచారం అందించాయని తెలిపారు.

అందుకే కీవ్ నగరానికి రష్యా ప్రైవేటు సైన్యం
కాగా, హై ప్రొఫైల్ మిషన్‌తోనే వారు రంగంలోకి దిగుతారు. దేశాధినేత హత్య అనేది ఓ భారీ లక్ష్యం. అది రష్యన్లు కూడా తిరస్కరించే విషయం. అందుకే ఒకవేళ అధ్యక్షుడి హత్య విజయవంతమైతే.. ఆ కుట్రలో తమ ప్రమేయం లేదని చెప్పుకునేందుకు ఈ ప్రైవేటు సైన్యాన్ని మోహరించి ఉండవచ్చని ఓ అంతర్జాతీయ దౌత్యవేత్త వెల్లడించారు. ఇప్పటికే భారీ దాడులతో కీవ్ తోపాటు పలు నగరాలపై రష్యా బలగాలు పట్టుసాధించాయి. అయితే, రష్యా బలగాలకు ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. రష్యా బలగాల దాడుల్లో వెయ్యి మందికిపైగా సామాన్య ప్రజలు, 4వేలకుపైగా సైనికులు మరణించారని తెలుస్తోంది. అయితే, రష్యాకే భారీ నష్టం జరిగిందని ఉక్రెయిన్ చెబుతోంది. ఇప్పటికే 10వేలకుపైగా రష్యా సైనికులు మరణించారని, భారీ యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను కూడా ధ్వంసం చేశామని ఉక్రెయిన్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications