అమెరికాలో దీనంగా భారతీయ ఉద్యోగులు-భయంతో ఏం చేస్తున్నారో తెలుసా?
కొన్నేళ్లుగా ఉన్నత చదువులు, ఆకర్షణీయమైన ఉద్యోగాల కోసం అమెరికా బాట పట్టిన భారతీయులకు ప్రస్తుతం అక్కడ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక మారిన పరిస్ధితులు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని అనుమతులతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పర్యాటక, ఉన్నత విద్య వీసాలపై అమెరికాకు వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, డుంకీ మార్గాల్లో అక్రమంగా వచ్చిన వారికి మాత్రం కంటి మీద కునుకు ఉండటం లేదు. దీంతో వీరి పరిస్ధితి ఎంతో దయనీయంగా ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు కోసం అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. స్దానికంగా ఉన్న అమెరికన్లు ఇస్తున్న సమాచారం కూడా దీనికి తోడవడంతో భారతీయులంటేనే అక్రమ వలసదారులనేలా చాలా చోట్ల పరిస్ధితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో దొరికితే వెంటనే అరెస్టు చేసి భారత్ కు సంకెళ్లు వేసి తరలించడం ఖాయమన్న భయాలు అక్కడి పార్ట్ టైమర్లను వెంటాడుతున్నాయి. దీంతో వీరంతా ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారట.

తాజాగా నిబంధనలకు విరుద్దంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత విద్య కోసం, టూరిస్టు వీసాలపై వెళ్లిన వాళ్లు సైతం అమెరికాలో బయట తిరిగేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. బయట దొరికితే కచ్చితంగా పట్టుకుని అరెస్టు చేస్తారని, జైళ్లలో పెడతారని, భారత్ కు విమానాలు ఎక్కించి పంపేస్తారన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో రెగ్యులర్ గా వీరు వెళ్లే పార్ట్ టైమ్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు బయటికి వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతున్నారట. తాజాగా 104 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేయడం, మరో 487 మంది రెండో విడతలో ఉన్నారని భారత్ ప్రకటించడం వీరిలో భయాల్ని మరింత పెంచిందని చెప్తున్నారు.
అమెరికా ప్రభుత్వానికి చెందిన ఐస్ అధికారులు పత్రాలు లేని వలసదారులను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్క్ పర్మిట్‌లపై దేశంలో ఉన్న ఇతరులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉన్నప్పటికీ, తాను అరిజోనాకు వెళ్లిన సమయంలో అమెరికా సరిహద్దు పోలీసులు తనను కూడా ప్రశ్నించారని తాజాగా జస్మీత్ సింగ్ అనే భారతీయ డ్రైవర్ తెలిపారు.
తన వర్క్ పర్మిట్, ఇతర పత్రాలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తనను వెళ్ళడానికి అనుమతించారన్నారు. దీన్ని బట్టి సరైన పత్రాలు ఉన్న వారికీ తనిఖీలు తప్పడం లేదని తెలుస్తోంది. ఐస్ అధికారుల దాడుల నేపథ్యంలో ఇలా అక్రమ పత్రాలతో అమెరికాలో వారు ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతాలు ఖాళీ అయిపోయాయి.












Click it and Unblock the Notifications