యుద్ధ ఛాయలు: తక్షణమే రష్యా నుంచి వెనక్కి రావాలంటూ అమెరికన్లకు జో బైడెన్ ఆదేశాలు
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి ఎక్కడా బ్రేకులు పడట్లేదు. 13 నెలలు దాటినప్పటికీ నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు అండగా నిలిచింది అమెరికా. ఆ దేశానికి అవసరమైన ఆర్థిక, యుద్ధ సామాగ్రిని అందజేస్తోంది. అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తోంది. అక్కడితో ఆగలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ఇటీవలే ఉక్రెయిన్ లోనూ పర్యటించారు. రాజధాని కీవ్ లో ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో సమావేశం అయ్యారు. దీనికి పోటీగా అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా- ఉక్రెయిన్ లో తమ దేశం ఆక్రమించుకున్న భూభాగాన్ని సందర్శించారు.

అదే సమయంలో రష్యాలో విధి నిర్వహణలో ఉన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ ఇవాన్ గెర్స్‌కోవిక్‌ను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశద్రోహానికి పాల్పడుతున్నాడనే కారణంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇది కాస్తా అమెరికా- రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినట్టయింది. వాల్‌స్ట్రీట్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడాన్ని వైట్ హౌస్ తప్పుపట్టింది. ఆయనను అరెస్ట్ చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నామని తెలిపింది. ఇవాన్ ను విడుదల చేసేలా రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
రష్యాలో నివసించే అమెరికన్లు అక్కడి పోలీసులు, భద్రత సిబ్బంది లక్ష్యంగా చేసుకున్నారనే విషయం ఈ అరెస్ట్ తో స్పష్టమైందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్-పియర్రె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య ఏ మాత్రం సమర్థనీయం కాదని చెప్పారు. జర్నలిస్టులను అణచి వేసే ప్రయత్నాలను ఏ దేశం కూడా సమర్థించదని అన్నారు. ఈ విషయంపై తమ దేశంలోని రష్యా రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడామని, తమ నిరసనను తెలియజేశామని వివరించారు.

రష్యాలో నివసించే అమెరికన్లకు ఎలాంటి భద్రత లేదని కెరిన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ నివసించే అమెరికన్లందరూ తక్షణమే రష్యాను ఖాళీ చేయాలని, స్వదేశానికి తరలి రావాలని సూచించారు. వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం రష్యాకు వెళ్ల దలిచిన అమెరికన్లకు కూడా వైట్ హౌస్ హెచ్చరికలను జారీ చేసింది. రష్యాలో నవసించే అమెరికన్లు వెంటనే స్వదేశానికి తరలి రావాలని, అక్కడికి వెళ్లదలచుకున్న వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications