గే, లెస్బియన్ నైట్ క్లబ్‌లో పేలిన గన్..!!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ పేలింది. అయిదుమందిని బలి తీసుకుంది. మరో 18 మందిని తీవ్రంగా గాయపరిచింది. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ సరిపోవట్లేదు. తరచూ ఇవి సంభవిస్తూనే వస్తోన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి 598 సంఘటనలు చోటు చేసుకన్నాయి. సగటున ప్రతిరోజూ అమెరికాలో రెండు చోట్ల మాస్ షూటింగ్ జరుగుతోంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి. 692 కాల్పుల ఘటనలు సంభవించాయి.
ఉక్కుపాదం మోపినా..
దీన్ని నివారించడానికి జో బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ఆయుధ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది. ఆటోమేటిక్ గన్స్ వినియోగంపైనా ఆంక్షలను విధించింది. అందరికీ గన్ లైసెన్స్‌ను ఇవ్వడంపై ఉక్కుపాదం మోపింది. ఇంతా చేసినప్పటికీ అమెరికాలో గన్ కల్చర్‌కు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.
ఇప్పుడు తాజాగా మరోసారి తుపాకీ పేలిందక్కడ. కొలరాడోలోని ఓ నైట్ క్లబ్‌లో సంభవించిన కాల్పుల ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో 18 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఈ సంవత్సరంలో జరిగిన కాల్పుల ఘటనలకు సంబంధించి ఇది 598వది.
నైట్ క్లబ్‌లో..
కొలరాడో స్ప్రింగ్స్‌లో గల క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్‌లో ఈ కాల్పుల ఘటన సంభవించింది. ఇది గే నైట్ క్లబ్. దీని పేరు క్లబ్ క్యూ. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లబ్ ఇది. గే, లెస్బియన్లు రోజూ ఈ క్లబ్‌లో కలుస్తుంటారు. వీకెండ్ కావడం వల్ల వారి సంఖ్య మరింత అధికంగా ఉంది. డీజే సౌండ్స్, డ్రాగ్ షోస్, కరావొకె ప్రోగ్రామ్స్ ఇక్కడ తరచూ నిర్వహిస్తుంటారు. ఈ శనివారం కూడా డీజే సౌండ్స్ నిర్వహిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

ఆసుపత్రికి..
శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో క్లబ్ క్యూలో కాల్పులు జరిగాయి. 11:57 నిమిషాలకు కొలరాడో స్ప్రింగ్స్ పోలీసులకు ఈ సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ లెప్టినెంట్ పమేలా క్యాస్ట్రో తెలిపారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..
ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటనేది తమకు ఇంకా తెలియరాలేదని పమేలా క్యాస్ట్రో తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తోన్నామని వివరించారు. షూటర్‌గా భావించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.












Click it and Unblock the Notifications