US-Iran War: మళ్లీ అమెరికా-ఇరాన్ వార్..! ముహుర్తం ఫిక్స్..? చమురు భయాలు..!
అణ్వస్త్రాల తయారీ విషయంలో వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్న ఇరాన్ (iran)పై సైనిక చర్యకు అమెరికా-ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఓవైపు ఇరాన్ తో చర్చలు జరుపుతూనే, మరోవైపు గల్ఫ్ తీరంలోకి యుద్ధ నౌకల్ని పంపుతున్న అమెరికా.. ఇక యుద్దం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ కూడా దీటుగానే స్పందిస్తోంది. గతేడాది అమెరికా-ఇజ్రాయెల్ కలిసి చేసిన యుద్దాన్ని అడ్డుకుని ఎదురుదాడులు చేసిన ఇరాన్ ఈసారి ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ యుద్దం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరల మంట తప్పేలా లేదు.
ఇరాన్ తో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆ దేశంపై యుద్దం తప్పదని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పటివరకూ ఏ పురోగతి లేకపోవడంతో వార్ కే సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈసారి యుద్దం గత నెలలో జరిగిన వెనెజులా అధ్యక్ష దంపతుల కిడ్నాప్ తరహాలో ఉండొచ్చని, అలాగే ఇరాన్ అణు స్థావరాల్ని పూర్తి స్ధాయిలో నాశనం చేసేలా ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఈసారి కూడా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ వార్ చేపట్టబోతున్నాయి.

నిన్నట్రంప్ ప్రతినిధులు జేర్డ్ కుష్నర్, స్టీవ్ విట్ కాఫ్ ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్జీతో భేటీ అయి నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పురోగతి ఉందని ఇరువర్గాలు ప్రకటించాయి. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నా.. తమ అధ్యక్షుడు ట్రంప్ గీసిన కొన్ని గీతల్ని అంగీకరించేందుకు ఇరాన్ సిద్దంగా లేదన్నారు. తమ అధ్యక్షుడు కోరుకుంటే ఒప్పందం అదే కుదురుతుందని, అప్పుడు చర్చలూ ముగుస్తాయన్నారు.

మరోవైపు ఈ వారాంతంలోపే ఇరాన్ పై దాడికి అమెరికా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యం మొహరింపులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు డజను యుద్ద నౌకలు, వందల ఫైటర్ జెట్లు, పలు క్షిపణి విధ్వంస వ్యవస్దలు అక్కడ మోహరించి ఉన్నాయి. ఇంకా ఆయుధాలతో 150 కార్గో విమానాలు, ఎఫ్ 35, ఎఫ్22, ఎఫ్ 16లు కలిపి మొత్తం 50 ఫైటర్ జెట్లు అక్కడికి బయలుదేరాయని తెలుస్తోంది. దీన్ని బట్టి అతి త్వరలో ఇరాన్ పై అమెరికా దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇదంతా ముందుగానే ఉహిస్తున్న ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు సరఫరాల్ని అడ్డుకోవాలని ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications