అదే మా అతిపెద్ద విజయం.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా నిరోధించడమే తమ పరిపాలనా కాలంలో సాధించిన అతిపెద్ద విజయంలో ఒకటని ఆయన గర్వంగా ప్రకటించారు. ఒకవేళ తమ ప్రభుత్వం ఆ వినాశకరమైన చర్యను సరైన సమయంలో అడ్డుకోకపోయి ఉంటే.. ఈపాటికి ఇరాన్ అణ్వాయుధాలను వినియోగించి తీవ్ర వినాశనాన్ని సృష్టించి ఉండేదని ట్రంప్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఏ ఇతర అమెరికా అధ్యక్షుడు తీసుకోలేని అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తాము తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అంతే ఘాటుగా స్పందించారు. అణు నిరోధం అనేది కేవలం సాకు మాత్రమేనని, అసలు విషయం అమెరికా మధ్యప్రాచ్యంలో చూపించాలనుకుంటున్న ఆధిపత్యమేనని ఆయన మండిపడ్డారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని, వారి విధానాలను ఇరాన్ అంగీకరించకపోవడమే ఈ వివాదాలన్నింటికీ అసలు కారణమని అరాఘ్చీ స్పష్టం చేశారు. గతంలో ప్రపంచ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఇరాన్ అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించినప్పటికీ, అమెరికానే ఎటువంటి సరైన కారణం లేకుండా ఆ ఒప్పందాల నుంచి ఏకపక్షంగా తప్పుకుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధంతో సాధించేది ఏమీ లేదు.. హెచ్చరించిన ఇరాన్
అమెరికాతో దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ తమ రక్షణ దళాల సన్నద్ధతను నొక్కి చెప్పింది. నేరుగా యుద్ధానికి దిగితే జరిగే తీవ్ర పరిణామాల గురించి అమెరికాకు బాగా తెలుసని అరాఘ్చీ హెచ్చరించారు. అమెరికా తమపై కొత్తగా ఏ యుద్ధాన్ని ప్రకటించకుండా అడ్డుకుంటున్నది కేవలం ఇరాన్ సైనిక బలగాల సంపూర్ణ సన్నద్ధతేనని ఆయన తేల్చి చెప్పారు. యుద్ధం ద్వారా అమెరికా తన లక్ష్యాలలో దేనినీ సాధించలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో మళ్ళీ రాజుకున్న ఉద్రిక్తతలు
ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు, అణు వ్యవహారాలపై చర్చలను పునరుద్ధరించేందుకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం (MoU) విఫలమవడమే ప్రస్తుత ఘర్షణలకు కారణమైంది. ఈ ఒప్పందం దెబ్బతినడంతో పశ్చిమాసియా ప్రాంతంలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై దాడులు జరపగా, దానికి ప్రతికారంగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రంగా మారాయి.














Click it and Unblock the Notifications
