కొరడా ఝుళిపించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్, మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ పై పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దక్షిణ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్.. తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించిందని డొనాల్డ్ ట్రంప్ ఈ పిటీషన్ పేర్కొన్నారు.
2003లో జెఫ్రీ ఎప్ స్టైన్‌కు ట్రంప్ రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖలో లైంగికంగా అనుచితమైన అంశాలు ఉన్నాయని గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. అది ఇప్పుడు పరువునష్టం దావాకు దారి తీసింది. లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్ స్టైన్ 2019లో న్యూయార్క్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు.

2003లో జెఫ్రీ ఎప్ స్టైన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లైంగికంగా అనుచితమైన బొమ్మను పంపాడని, వారిద్దరి మధ్య ఉన్న కొన్ని రహస్యాల గురించి అందులో రాశారని వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పట్లో ఓ కథనాన్ని ప్రచురించింది. దీన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ఇది అవాస్తవమని, తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఉందని అన్నారు.
ఈ కథనం వెనుక ఉన్న వ్యక్తులు దురుద్దేశంతో తన ప్రతిష్టను, ఆర్థికంగా నష్టపరిచేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ డౌ జోన్స్ ఆధీనంలో ఉంది. డౌ జోన్స్ అనేది మీడియా మొఘల్ రూపర్ట్ ముర్డోక్ ప్రారంభించిన న్యూస్ కార్ప్ గ్రూప్ కు చెందినది.
ఈ కథనాన్ని గనక సరి చేయకపోతే ముర్డోక్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా ట్రంప్ హెచ్చరించారు. కాగా జర్నల్ కథనం నిజమో కాదో తాము ధృవీకరించలేదని రాయిటర్స్ వివరించింది. రూపర్ట్ ముర్డోక్, ఆయనకు చెందిన WSJపై పరువు నష్టం దావా వేయబోతున్నానంటూ తొలుత తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ పై ఓ పోస్ట్ పెట్టారు ట్రంప్. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే దక్షిణ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఎప్‌స్టైన్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 2006లో మొదటిసారి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అదే సంవత్సరం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత జైలు నుంచి విడుదల అయ్యారు. తిరిగి సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మళ్లీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత 2019లో జైలులో మరణించాడు.
1990, 2000లో ఎప్‌స్టైన్‌తో కలిసి ట్రంప్ కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్‌స్టైన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయం తనకు తెలియకముందే ఆయనతో సంబంధాలు తెంచుకున్నానని.. ట్రంప్ 2019లో తెలిపారు.












Click it and Unblock the Notifications