హమాస్‌కు ట్రంప్ డెడ్ లైన్.. నరకం చూపిస్తా అంటూ వార్నింగ్ !!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికపై హమాస్ తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో "హమాస్‌కు నరకం తప్పదు" అని స్పష్టంచేశారు.
20 సూత్రాల ఫార్ములా..
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో కలిసి రూపొందించిన 20 సూత్రాల ఫార్ములా ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
- హమాస్ 72 గంటల్లో బందీలందరినీ విడుదల చేయాలి.
- ప్రతిగా ఇజ్రాయెల్ 250 మంది ఖైదీలను విడుదల చేస్తుంది.
- అదనంగా 1,700 మంది సాధారణ పౌరులను విడిపించాలి.
- గాజా పాలనలో ఇకపై హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండదు.
- హమాస్ యొక్క ఆయుధ వ్యవస్థలు, సొరంగాలు పూర్తిగా ధ్వంసం చేయాలి.
అలానే మరికొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ మాత్రం "అధ్యయనం చేస్తున్నాం" అని చెప్పి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ట్రంప్ డెడ్‌లైన్..
దీంతో హమాస్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతోనే ట్రంప్ "చివరి అవకాశం"గా ఈ డెడ్‌లైన్ విధించారు. ఒప్పందంపై సంతకం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. గాజాలో మరింత ఘర్షణలు తప్పవని తెలిపారు.
కాగా ట్రంప ప్రతిపాదనలకు ప్రపంచవ్యాప్తంగా స్పందన వస్తోంది. భారత్, చైనా, రష్యా సహా పలు దేశాలు దీనికి మద్దతు ప్రకటించాయి. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఈ ఒప్పందం కుదిరితే యుద్ధానికి శాశ్వత ముగింపు లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక ట్రంప్ ఈ విధమైన దూకుడు ధోరణితో వ్యవహరించడం అమెరికా రాజకీయాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా.. ప్రపంచ శాంతి కోసం డీల్ మేకర్ గా నిలబడాలని ఆయన ప్రయత్నిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఒప్పందం కుదరకపోతే గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది పౌరులు నిరాశ్రయులై ఉన్నారు. విద్యుత్, నీరు, ఔషధాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ దృష్టి హమాస్ వైఖరిపైనే కేంద్రీకృతమైంది. ఒప్పందాన్ని అంగీకరిస్తే యుద్ధానికి తెరపడే అవకాశం ఉంది. లేకపోతే ట్రంప్ హెచ్చరించినట్టుగానే "నరకం చూపించే పరిణామాలు" ఎదురుకావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications