ఐదేళ్లలో బైడెన్ చనిపోతారట-అమెరికా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ?
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే రాజకీయ నేతల మధ్య మాటల దాడి మొదలైంది. ఇప్పటికే అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ప్రకటించిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి రేసులో ఉన్న నిక్కీ హేలీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా దేశంలో బైడెన్ అభ్యర్ధిత్వంపై చర్చకు దారి తీయాలనే లక్ష్యంతో చేసినట్లు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీపడతానని ప్రకటించిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై రిపబ్లికన్ అభ్యర్ధి రేసులో ఉన్న నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఐదేళ్లలో చనిపోతారని ఆమె జోస్యం చెప్పారు.2024 ఎన్నికల్లో గెలిస్తే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష పదవిని స్వీకరిస్తారని కూడా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేలీ ఈ వ్యాఖ్యలు చేసారు.

వచ్చే ఏడాది ఎన్నికల్లో బైడెన్ రెండవసారి ఎన్నికైతే ఆయన మద్దతుదారులు అధ్యక్షురాలిగా హ్యారిస్ కు మద్దతివ్వాల్సి ఉంటుందని నిక్కీ హేలీ తెలిపారు. బైడెన్ 86 ఏళ్ల వరకూ పదవిలో ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. 51 ఏళ్ల హేలీ తన ప్రచారంలో వయస్సు ,యోగ్యతను ప్రధాన అంశంగా మార్చేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 75 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు మానసిక సామర్థ్య పరీక్షను తప్పనిసరిగా ఎదుర్కోవాలన్నారు.
అయితే ఇప్పటికే అధ్యక్షుడు బైడెన్ చురుగ్గా, ఫిట్ గా ఉన్నారని నిరూపించేందుకు వైట్ హౌస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి కౌంటర్ గా బైడన్ ప్రత్యర్ధులు కూడా ఆయన్ను ముసలివాడిగా చూపిస్తూ అధ్యక్ష ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈసారి అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నిక్కీ హేలీ తాజా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications