డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్: అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Donald Trump: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 నవంబర్/డిసెంబర్ నెలల్లో అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల తరువాత ప్రతి జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి.. పోటీలో ఉన్నారు. ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తూ వస్తోన్నారు. పలు రాష్ట్రాల్లో జో బైడెన్ కంటే కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో కొలరాడో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువడించింది. డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేటు వేసింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అయన అనర్హుడని ప్రకటించింది. దీనికి గల కారణాలను వెల్లడించింది సుప్రీంకోర్టు. 2020లో అధ్యక్ష ఎన్నికల తరువాత ఆ దేశ పార్లమెంట్ భవనంపై భయానక దాడికి ట్రంప్‌ను కారకుడిగా గుర్తించింది.
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వాషింగ్టన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు.
దీనికి కారకుడు ట్రంప్ అని కొలరాడో సుప్రీంకోర్టు గుర్తించింది. ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనం ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వెలువడించింది. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని ఆదేశించింది.
ఇక్కడే ఆయనకు ఊరటను సైతం కల్పించింది సుప్రీంకోర్టు. ఈ తీర్పు కొలరాడో స్టేట్ వరకు మాత్రమే పరిమితమౌతుందని ప్రకటించింది. అంటే- కొలరాడో స్టేట్‌లో జరిగే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఇక కనిపించదు. మిగిలిన రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు. అక్కడ ఆయన పోటీ చేయవచ్చు.
ఈ తీర్పుపై ఏడుమంది న్యాయమూర్తులు గల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాలేదు. ముగ్గురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. నలుగురు ట్రంప్ నిషేధానికి మొగ్గు చూపారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో తీర్పు వెలువడింది.












Click it and Unblock the Notifications