అగ్రరాజ్యంతో యుద్ధానికి సిద్ధం: ఆ దేశ అధ్యక్షుడు సంచలన ప్రకటన
అగ్రరాజ్యమైన అమెరికాతో సాయుధ పోరాటానికి కూడా వెనుకాడబోమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాకు యుద్ధనౌకలు పంపించిన నేపథ్యంలో తమ దేశం గత వందేళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని మదురో అన్నారు.
8 యుద్ధ నౌకలు, ఒక అణు జలాంతర్గామి మోహరింపు
అమెరికా సైనిక దాడికి సిద్ధమవుతోందని భావించిన వెనిజులా ప్రభుత్వం.. తమ సరిహద్దుల్లో సైనికులను మోహరించింది. దేశ ప్రజలందరినీ త్వరగా సైన్యంలో చేరాలని నికోలస్ మదురో పిలుపునిచ్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సైనిక బృందాలను పంపుతున్నామని అమెరికా ప్రకటించింది. అయితే ఇది దాడికి ఒక సాకు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయంపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ.. "వెనిజులాను లక్ష్యంగా చేసుకుని 1,200 క్షిపణులతో కూడిన 8 యుద్ధనౌకలు, ఒక అణు జలాంతర్గామిని మోహరించారు. ఇది చాలా ప్రమాదకరమైన, అనైతికమైన ముప్పు" అని అన్నారు. "అమెరికా గరిష్ట సైనిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అందుకే మేము వెనిజులాలో గరిష్ట స్థాయి సన్నద్ధతను ప్రకటించాం" అని మదురో వివరించారు.
డ్రగ్స్ మాఫియా ఆరోపణలు.. 50 మిలియన్ డాలర్ల బహుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మదురో ప్రభుత్వంపై "కార్టెల్ ఆఫ్ ది సన్స్" అనే డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను నడుపుతోందని ఆరోపించారు. అంతేకాకుండా.. నికోలస్ మదురోను పట్టుకున్న వారికి 50 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించారు. దీనిపై మదురో ఘాటుగా స్పందిస్తూ, "మీరు ఏదైనా మాఫియా డాన్ కోసం చూస్తున్నట్లయితే వేరే చోటికి వెళ్ళండి. ఇక్కడ మీకు ఒక యోధుడు, అతని వెనుక నిలబడిన ప్రజలు, సాయుధ బలగాలు కనిపిస్తాయి" అని అన్నారు.
1962 క్యూబా క్షిపణి సంక్షోభంతో పోలిక
అమెరికా చర్యలను 1962 నాటి క్యూబా క్షిపణి సంక్షోభంతో మదురో పోల్చారు. "మేము ఏ బెదిరింపులకూ లొంగం. ఇది కేవలం వెనిజులాపై దాడి కాదు, మొత్తం ఖండంపై ఒత్తిడి. ఈ రోజు మయామీ మాఫియా వైట్‌హౌస్, స్టేట్ డిపార్ట్మెంట్‌ను స్వాధీనం చేసుకుంది" అని మదురో తీవ్రంగా విమర్శించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరీనా మాచాడో కూడా అధికార మార్పిడికి డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వెనిజులాలో యుద్ధ వాతావరణాన్ని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications