Nicolas Maduro Case: 92 ఏళ్ల జడ్జ్ అల్విన్ గురించి ఆసక్తికర విషయాలు
జనవరి 3న వెనిజులాపై అమెరికా సైన్యం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అనంతరం నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను న్యూయార్క్ సిటీ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తాను ఏ తప్పు చేయలేదని మదురో ఆవేదన వ్యక్తం చేశారు. తాను చాలా డీసెంట్ వ్యక్తి అని.. ఇప్పటికీ వెనిజులా అధ్యక్షుడినని చెప్పుకున్నారు. ఫెడరల్ అధికారులు తనపై మోపిన డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవం అని తాను ఏ తప్పు చేయలేదని కోర్టు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. మదురోపై ఉన్న నార్కో టెర్రరిజం ఆరోపణలను జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ చదివి మదురోకు వినిపించగా.. అందుకు మదురో సమాధానం ఇస్తూ.. తాను నిర్దోషినని.. తనకు ఏమీ తెలియదని జవాబు ఇచ్చారు.
అయితే ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన జడ్జి ఆల్విన్ హెల్లర్ స్టీన్ గురించి ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎవరీ ఆల్విన్ హెల్లర్ స్టీన్..?
ఆల్విన్ హెల్లర్‌స్టీన్ (Alvin K. Hellerstein) అమెరికాలో అత్యంత అనుభవజ్ఞులైన ఫెడరల్ న్యాయమూర్తుల్లో ఒకరు. 92 ఏళ్ల వయసు గల ఆయన.. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ జడ్జిగా (Southern District of New York - SDNY) సేవలందిస్తున్నారు. న్యూయార్క్ సిటీ పరిధిలో వచ్చే కీలకమైన ఫెడరల్ కేసులను విచారించే కోర్టుల్లో ఇది ఒకటి. అంతర్జాతీయ నేరాలు, ఉగ్రవాదం, డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, హై-ప్రొఫైల్ రాజకీయ కేసులు ఎక్కువగా ఇదే కోర్టులో విచారణకు వస్తుంటాయి.

ఆల్విన్ హెల్లర్‌స్టీన్‌కు న్యాయరంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. ఆయనను 1998లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఫెడరల్ జడ్జిగా నియమించారు. అంతకుముందు ఆయన న్యాయవాదిగా, అలాగే న్యాయ విద్యారంగంలోనూ కీలక పాత్ర పోషించారు. న్యూయార్క్ లా స్కూల్‌లో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.
హెల్లర్‌స్టీన్ పేరు ఎక్కువగా వినిపించడానికి కారణం.. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన కేసులను ఆయన విచారించడమే. 9/11 దాడులకు సంబంధించిన పరిహార కేసులు, గ్లోబల్ టెర్రరిజం, అంతర్జాతీయ డ్రగ్ కార్టెళ్లకు సంబంధించిన విచారణల్లో ఆయన కీలక తీర్పులు ఇచ్చారు. చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడం, రాజకీయ ఒత్తిళ్లకు లోబడకుండా తీర్పులు ఇవ్వడం ఆయన ప్రత్యేకతగా న్యాయ వర్గాలు పేర్కొంటాయి.
అందుకే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై నమోదైన నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన ఆరోపణల కేసు విచారణకు ఆల్విన్ హెల్లర్‌స్టీన్ ముందుకు రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications