వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మంచు ఎక్కడైనా తెల్లగా ఉంటుంది. కానీ ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాలలో మాత్రం మంచు వింతగా ఎరుపు రంగులో కనిపిస్తోంది.

వసంత రుతువు చివర్లో, వేసవి కాలం ప్రారంభంలో ఆల్ఫ్స్ పర్వతాల్లోని మంచులో కొన్ని విచిత్రమైన మచ్చలను మనం చూడవచ్చు.

ఈ మంచు తెలుపు రంగులో కాకుండా రక్తపు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది.

ప్రశాంతమైన పర్వత సానువుల్లో ఈ రకమైన మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆల్ఫ్స్ పర్వతాల్లో రంగురంగుల మంచు ముక్కలు కనిపించడం అక్కడి వాతావరణ మార్పుల ప్రభావానికి సంకేతం కావచ్చు.

ఈ మంచులో పెరిగే మైక్రోస్కోపిక్ ఆల్గే (నాచులా ఉండే ఒక రకమైన పాచి) ఉత్పత్తి చేసే రక్షణ యంత్రాంగం ఫలితంగా ఈ రకమైన మచ్చలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా మైక్రోస్కోపిక్ ఆల్గే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది వర్ణద్రవ్యమైన క్లోరోఫిల్‌ను కలిగి ఉంటుంది.

ఈ మొక్కలు సూర్యకాంతి నుంచి శక్తిని గ్రహించడంలో క్లోరోఫిల్ సహాయపడుతుంది.

పర్వతాల్లో విరివిగా పెరిగిన మైక్రోస్కోపిక్ ఆల్గే... సౌరవికిరణానికి గురైనప్పుడు కెరోటనాయిడ్స్ అని పిలిచే ఎరుపు రంగు వర్ణద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎరుపు రంగు వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్‌కు రక్షణగా పనిచేస్తాయి.

ఈ ఎరుపు రంగు ఆల్గే చాలా కాలంగా ఉనికిలో ఉంది. శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా కనిపెట్టడానికి ప్రయత్నిస్తోన్న రహస్యాలలో ఇది కూడా ఒకటి.

చెక్ రిపబ్లిక్‌లోకి ప్రేగ్ చార్లెస్ యూనివర్సిటీకి చెందిన వృక్ష శాస్త్రవేత్తలు, రెండేళ్ల క్రితం మైక్రోఆల్గేలో పూర్తిగా కొత్త జాతిని గుర్తించారు.

'సాంగ్వానా' అని పిలవబడే ఈ కొత్త జాతి, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎరుపు లేదా నారింజ రంగు మంచు ఏర్పడటానికి కారణమవుతోంది.

ఎరుపు రంగు మంచు మచ్చల్ని ఏర్పరిచే ఈ సాంగ్వానా జాతి ఆల్గేను యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలతో పాటు ధ్రువ ప్రాంతాల్లో కనుగొన్నారు.

అసాధారణమైన నారింజ రంగు మంచుకు కారణమయ్యే ఒక రకమైన సాంగ్వానాను నార్వేలోని స్వాల్బర్డ్‌లో గుర్తించారు.

ఎరుపు రంగు మంచు ఏర్పడటానికి ఇదొక్కటే కారణం కాదు.

ఈ మైక్రోస్కోపిక్ ఆల్గేలోని వివిధ రకాలు మంచులో రంగుల్ని ఏర్పరుస్తాయి. 'క్లమోడోనమస్ నివలీస్‌'తో పాటు అంటార్కిటిక్‌లోని పెంగ్విన్ల కాలనీల్లో ఉండే 'క్లోరోమోనస్ పాలిప్టెరా' రకాలు కూడా ఎరుపు, గులాబీ వర్ణం మంచు తయారయ్యేందుకు కారణమవుతాయి.

ఈ ఎరుపు రంగు ఆల్గే గురించి మరింత ఎక్కువ అర్థం చేసుకోవడం అనేది... ఆల్ఫ్స్ పర్వతాలు, ధ్రువ ప్రాంతాల్లో ఉండే రంగురంగుల మంచు మచ్చల ఉనికి గురించి వివరించడం కంటే చాలా ముఖ్యమైంది. అవి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో పాటు, పర్యావరణ వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకునేందుకు ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎరుపు రంగు మంచు ఏర్పడటం సాధారణమైందని జర్మనీలోని పోష్‌దామ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇంటర్‌ఫేస్ జియో కెమిస్ట్రీ ప్రొఫెసర్ లియానీ జి బెన్నింగ్ అన్నారు.

'వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిల పెరుగుదల అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోంది. దీని వల్ల మంచు మరింత ఎక్కువగా కరుగుతుంది. మంచులో నీరు చేరితే ఆల్గే పెరగడం ప్రారంభమవుతుంది' అని ఆమె వివరించారు.

ఎరుపు రంగు మంచు ఆల్గే పెరుగుదల వాతావరణ మార్పులకు కూడా దోహదం చేస్తుంది. ఈ రెడ్ పిగ్మెంట్ వర్ణద్రవ్యం వల్ల మంచు ముదురు రంగులోకి మారుతుంది. దీనివల్ల బయటకు ప్రతిబింబించే కాంతి, వేడి స్థాయిలు తగ్గిపోతాయి. దీన్ని ఆల్బెడో ఎఫెక్ట్ అంటారు. పైగా బయట సూర్యకాంతి వల్ల మంచు ఇంకా వేగంగా కరుగుతుంది. ఇది ఆల్గే విస్తరించడానికి కారణమవుతుంది.

లేత రంగు మంచు శోషించుకునే వేడి వల్ల వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తాయి. ఈ వేడి... మంచు గడ్డలు, హిమానీనదాలు కరగడాన్ని వేగవంతం చేస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, రెడ్ పిగ్మెంట్ ఆల్బే, ఒక సీజన్‌లో మంచు ఆల్బెడోను 13 శాతానికి తగ్గించగలదని అంచనా. వాతావరణ మార్పు ప్రభావాలు పర్వత ప్రాంతాల్లో ఎలా విస్తరిస్తాయో తెలుసుకోవడంలో రెడ్ పిగ్మెంట్ ఆల్బే కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అంటార్కిటికా నుంచి హిమాలయాల వరకు, ఆర్కిటిక్ ప్రాంతాల్లోని గ్లేసియర్‌లలో రెడ్ ఆల్గల్ బ్లూమ్స్ ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ రెడ్ ఆల్గల్ బ్లూమ్స్ మరింత విస్తృతంగా మారుతున్నాయా? ఇవి తరచుగా ఏర్పడతాయా అనే ప్రశ్నకు సమాధానాలు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు బెన్నింగ్, ఎరిక్ మరీచల్ ఆసక్తిగా ఉన్నారు.

ఫ్రాన్స్‌లోని గ్రెనోబెల్ సెల్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ లాబోరేటరీకి డైరెక్టర్‌గా ఎరిక్ పనిచేస్తున్నారు.

అంటార్కిటికాలోని కింగ్‌జార్జి ఐస్‌లాండ్‌కు చెందిన ఫిల్డెస్ ఫెనిన్సులా మంచు క్షేత్రాలపై ఉపగ్రహ చిత్రాల సహాయంతో చేసిన పరిశోధనలో... 2017 జనవరిలో ఆల్గే కారణంగా 26 శాతం మంచు ముదురు రంగులోకి మారినట్లు తేలింది.

ప్రపంచవ్యాప్తంగా రెడ్ ఆల్గే సర్వ సాధారణంగా మారుతున్నట్లు విస్తృతమైన డేటా అందుబాటులో ఉంది. వాతావరణం వేడెక్కిన కొలదీ తరచుగా ఆల్గే ఏర్పడుతోందని బెన్నింగ్, మరీచల్ నమ్ముతున్నారు. ఆల్గే వల్ల తలెత్తే ప్రభావాల గురించి శోధిస్తున్న శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.

వాతావరణ మార్పులో దీని పాత్ర కూడా ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు ఎరుపు రంగు మంచు చుట్టూ ఉన్న ఇతర రహస్యాలపైనే దృష్టి సారిస్తున్నారు.

మంచు పర్వతాలు

ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాల్లో 2,000 మీ (6,562 అడుగులు) ఎత్తులో మాత్రమే ఎరుపు రంగు ఆల్గే పెరుగుతుందని మరీచల్, అతని సహచరులు ఇటీవల కనుగొన్నారు. మరీ ముఖ్యంగా 2,400మీ (7,874 అడుగులు) ఎత్తులో వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు.

మరీచల్ అధ్యయన ప్రకారం, అధిక ఎత్తులో ఉన్న మంచుగడ్డల పరిమాణం, నాణ్యత, మన్నిక కారణంగా సాంగ్వానా ఆల్గే ఏర్పడుతుంది.

ఇటువంటి ఆల్గేను పరిశోధనశాలల్లో పెంచడానికి ప్రయత్నించి శాస్త్రవేత్తలు విఫలమయ్యారు.

'దీనిపై స్పష్టమైన అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు వీలైనన్ని ఎక్కువ నమూనాలను సేకరించాలి' అని మరీచల్ అన్నారు.

జూన్‌లో ఫ్రాన్స్‌లోని ఆగ్నేయ హ్యూటస్ ఆల్ఫ్స్ లాటరెట్ పాస్ పర్వతాల్లో రెండు రోజులు చేసిన యాత్ర సందర్భంగా మారీచల్, అతని సహచరులు తొలి నమూనాలను సేకరించారు.

గతేడాది తరహాలో కాకుండా ఈసారి అక్కడ మంచు ఎరుపు రంగులో కాకుండా పసుపు రంగులో ఉంది.

మంచులో ఇసుక ఉన్నందువల్లే అది పసుపు వర్ణంలో ఉన్నట్లు వారు నమ్ముతున్నారు. ఈ ఇసుకే వల్లే ఆల్గే ఏర్పరిచే రంగుకు అంతరాయం కలిగిందని చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా సహారాలోని ఇసుక ఆల్ఫ్స్ పర్వతాలకు చేరినట్లు పేర్కొన్నారు.

'ఇది మంచులో ఆల్గే పెరుగుదలకు, ఇసుకకు మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి మంచి అవకాశాన్ని కల్పించింది. ఇసుకతో కూడిన ఈ ఆల్గేను విశ్లేషించడం ద్వారా, ఆల్గే పెరుగుదలకు కావల్సిన పోషకాలను, మూలకాలను ఇసుక అందజేస్తుందా అనే అంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం' అని మరీచల్ వివరించారు.

మంచులోని ఐరన్ స్థాయిలు, యాసిడ్ స్థాయిలు ఎరుపు రంగు ఆల్గే పెరుగుదలకు ఎలా దోహదపడతాయో అర్థం చేసుకునే పరిధిని పెంచుకోవాలని వారి బృందం భావిస్తోంది. వీటితో పాటు పర్వత సానువుల్లో నివసించే జంతువులు, సూక్ష్మజీవులు కూడా మంచు ఆల్గే పెరుగుదలలో పాత్ర పోషిస్తాయా అని కూడా వారు అధ్యయనం చేస్తున్నారు.

జూన్‌లో సేకరించిన ఆల్గే నమూనాలను పరిశీలించగా అందులో కణరహిత జీవులైన 'జూప్లాంక్టన్' ఉనికిని కనుగొన్నట్లు మరీచల్ తెలిపారు. ఈ జీవులు సముద్రాలు, సరస్సులు, గ్లేసియర్స్, మంచులో మనుగడ సాగిస్తాయి.

మంచు జడ పదార్థంగా కనిపించిన్పటికీ, అది జీవులతో సంబంధాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోవడంలో ఈ పరిశోధన దోహదపడింది.

'మంచు కురిసినప్పుడు అందులో నత్రజని, భాస్వరం లాంటి మూలకాలు ఉండటం సహజం' అని బెన్నింగ్ అన్నారు. మంచు ఆల్గే వీటిని శోషించవచ్చు. అప్పుడు మంచులోని బ్యాక్టీరియా కూడా ఆల్గేతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది.

'పర్యావరణ వ్యవస్థలో మంచు ఆల్గే ప్రాథమిక ఉత్పత్తిదారు. ఆల్గే, కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా పోషకాలను స్వీకరించి, చక్కెరలు ఇతర మూలకాల రూపంలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యర్థాలు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి'

మరీచల్ ప్రకారం, ఆల్గే మనుగడ సాగించడానికి కార్బన్ డయాక్సైడ్‌తో పాటు కాంతి అవసరం. వీటి సహాయంతో శిలీంద్రాలు, బ్యాక్టీరియా, జూప్లాంక్టన్ లాంటి జీవులు బతకడానికి అవసరమైన వ్యవస్థను ఆల్గే రూపొందిస్తుంది.

అయితే ఈ రంగు రంగుల మంచు మచ్చల జీవితకాలం కూడా తక్కువే. ఏడాదిలో కొన్ని వారాల పాటు మాత్రమే ఇవి కనిపిస్తాయి. మళ్లీ వాతావరణం చల్లబడగానే మంచు రంగును కోల్పోయి సాధారణ స్థితికి చేరుతుంది.

కానీ వాస్తవానికి శీతాకాలంలో ఎరుపు రంగు ఆల్గేకు ఏం జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతోంది

'ఇక్కడ ఒక సిద్ధాంతం ఏంటంటే శీతాకాలంలో ఆల్గే నిద్రాణమవుతుంది. చల్లటి వాతావరణంలో పూర్తి పారదర్శకంగా మారుతుంది' అని బెన్నింగ్ చెప్పారు. 'ఇది శక్తిని వినియోగించే ప్రక్రియ కాబట్టి అవసరం లేనప్పుడు ఆల్గే పిగ్మెంటేషన్‌ను కోల్పోతుంది'

ఇక ప్రతీ ఏడాది వసంత రుతువులో లేదా వేసవిలో మంచుకు ఎరుపు రంగు వర్ణద్రవ్యం సంతరించుకున్నప్పుడు బెన్నింగ్‌తో పాటు ఆమె సహచరులు వాటిపై పరిశోధనలు జరిపి కొత్త విషయాలను వెల్లడించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is snow in red colour in Alps mountains
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X