నగరం మొత్తం బాంబుల మోతలు.. పేలుళ్లు- బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం
వెనిజులా రాజధాని కారకాస్ చుట్టూ పేలుళ్లు నమోదయ్యాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. బాంబు మోతలతో దద్దరిల్లిపోతోందా సిటీ. దీనికితోడు నగరం గగనతలంపై తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టిన శబ్దాలు వినిపించాయి. వెనిజులా ప్రధాన సైనిక స్థావరంతో పాటు నగర దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ దేశ కాలమానం ప్రకారం.. వేకువ జామున 2 గంటల సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నగరం మొత్తం అట్టుడికిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థిలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, కంటి మీద కునుకు లేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. అగ్రరాజ్యం అమెరికా ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని తిప్పికొట్టడానికి వెనిజులా సైన్యం ప్రయత్నాలు సాగిస్తోంది.

వెనిజులాపై భూతల దాడుల జరిగే అవకాశం లేకపోలేదని కొద్దిరోజుల కిందటే హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఈ ప్రకటన చేసిన అతి కొద్దిరోజుల్లోనే కరాకస్ మొత్తం మీద బాంబుపేలుళ్లు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా దాడి చేసిందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై అటు వెనిజులా గానీ, ఇటు అమెరికా గానీ ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రకటన వెల్లడించలేదు. ఇంకాస్సేపట్లో దీన్ని ధృవీకరించవచ్చని తెలుస్తోంది.
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను మాదకద్రవ్యాల కార్టెల్‌కు అధిపతిగా ఇటీవలే ఆరోపించింది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. వెనిజులా నుంచి వచ్చే అక్రమ మాదక ద్రవ్యాల రవాణాపై అణచివేస్తామనీ ప్రకటించింది. ఈ ఆరోపణలను మదురో ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నందువల్లే అమెరికా తనపై తిరుగుబాటు కోరుకుంటుందని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
వెనిజులాని మరింత ఒత్తిడికి గురి చేస్తూ తన గగనతలాన్ని అనధికారికంగా మూసివేసింది. అదనపు ఆంక్షలు విధించింది. చమురుతో లోడ్ చేసిన వెనిజులా ట్యాంకర్లను సైతం స్వాధీనం చేసుకోవాలని అమెరికా ఇటీవలే ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ నుండి అమెరికా దళాలు కరేబియన్, తూర్పు పసిఫిక్ మహాసముద్రాల్లో మాదకద్రవ్యాల స్మగ్లర్ల పడవలపై అనేక దాడులు చేశాయి. అమెరికా సైన్యం విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్‌లో 107 మందికి పైగా మరణించారు.












Click it and Unblock the Notifications