ట్రంప్ అవుట్! అధ్యక్ష పదవి నుంచి తొలగింపు?
అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు ఇప్పుడు కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. బెట్టింగ్ మార్కెట్లను కూడా షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం, కీలక నిర్ణయాల్లో ఆయన అనుసరిస్తున్న మొండి వైఖరి సొంత పార్టీలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళన కలిగిస్తోంది
అమెరికా రాజ్యాంగంలోని '25వ సవరణ' (25th Amendment) ప్రకారం.. ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని భావిస్తే, ఉపాధ్యక్షుడు మరియు క్యాబినెట్ మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుంచి తొలగించవచ్చు. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని, ఆయన మానసిక స్థితి లేదా వ్యవహారశైలి పదవికి తగదని ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ చట్టసభ్యులు కూడా గళమెత్తుతున్నారు. ఇప్పటికే ఒక చట్టసభ్యుడు దీనిపై అధికారికంగా ప్రతిపాదన తెచ్చినట్లు సమాచారం.

బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో జోరు.. పెరిగిన 'Yes' ఓట్లు!
రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టే 'కాల్షీ' (Kalshi) వంటి ప్రిడిక్షన్ మార్కెట్లలో ట్రంప్ ఉద్వాసనపై పందాలు కాసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
- గత నెల అంచనా: ట్రంప్‌ను 25వ సవరణ ద్వారా తొలగిస్తారనే ప్రశ్నకు 'Yes' అన్న వారి సంఖ్య కేవలం 28.6% మాత్రమే ఉండేది.
- ప్రస్తుత ట్రెండ్: యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఈ శాతం 35.1%కి చేరింది. అంటే, ఆయన పదవీకాలం ముగియక ముందే ఇంటికి వెళ్లే అవకాశం ఉందని దాదాపు మూడింట ఒక వంతు మంది నమ్ముతున్నారు.
ఇరాన్ యుద్ధమే టర్నింగ్ పాయింటా?
పశ్చిమాసియాలో ఇరాన్‌తో మొదలైన ఘర్షణలు యుద్ధానికి దారితీయడం, మిత్రదేశాలను సంప్రదించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. శాంతిని నెలకొల్పాల్సిన అధ్యక్షుడు, యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరగడమే ఈ ఊహాగానాలకు బలాన్ని ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత యంత్రాంగమే అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసే పరిస్థితులు కనిపిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications