ఈ స్థితిలో నిన్ను చూస్తామని అనుకోలేదు కేన్ మామా
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. గత సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు అదే దూకుడును ప్రదర్శిస్తోంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిందీ జట్టు. ఈ సాయంత్రం తన రెండో మ్యాచ్‌ను ఆడబోతోంది గుజరాత్ టైటాన్స్. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడాల్సి ఉంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఎదురుదెబ్బ తిన్న ఢిల్లీ కేపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. తన పరిస్థితిని మెరుగుపర్చుకోవాలంటే గుజరాత్‌ను ఓడించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందా జట్టు. ఈ నేపథ్యంలో మరో రసవత్తరమైన పోరు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

గుజరాత్ టైటన్స్ దూకుడుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టుకు నిరాశకు గురి చేసే అంశం- కేన్ విలియమ్సన్ గాయం. చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కేన్ మామ గాయపడ్డ విషయం తెలిసిందే. చెన్నై కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని మోకాలికి గాయమైంది. ఇన్నింగ్ 13వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్‌ని అందుకునే సమయంలో గాల్లో జంప్ చేసిన కేన్.. అదుపు తప్పి కిందపడ్డాడు.
ఈ క్రమంలో అతని మోకాలు బలంగా నేలను తాకింది. బాధతో అతను విలవిల్లాడాడు. కాలు కింద పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ సపోర్టింగ్ స్టాఫ్ అతణ్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్‌తో నొప్పిని నివారించుకున్నాడు గానీ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టలేదు. అతనికి స్కానింగ్ నిర్వహించిన అనంతరం విశ్రాంతి అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఇక ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కాక తప్పలేదు. సీజన్ ముగిసేటప్పటికి కోలుకుంటాడని భావించినప్పటికీ.. అది సాధ్యపడలేదని టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి చెప్పారు.
Painful to see Kane Williamson in this situation!
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2023
Wishing him a speedy recovery. pic.twitter.com/cngFRlQiyg
ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందటే కేన్ విలియమ్సన్ జట్టును వీడాడు. స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఓ చిన్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు కేన్. సీ యూ సూన్.. అంటూ బాధతో వెనుదిరిగాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన అతను అక్లాండ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు. కుడి కాలికి కట్టు కట్టుకుని, ఊతకర్రల సహాయంతో నడుస్తూ కనిపించాడు కేన్ విలియమ్సన్.
తనను కలిసిన న్యూస్ హబ్ ఎన్‌జెడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ప్రస్తుతానికి పెద్దగా నొప్పి లేదని, కాలి మీద ఒత్తిడి పడకూడదని, పాదాలను కింద పెట్టకూడదంటూ డాక్టర్లు సలహా ఇచ్చారని చెప్పాడు. అందువల్లే ఊతకర్రలను వినియోగించాల్సి వస్తోందని చెప్పాడు. ప్రస్తుతం విలియమ్సన్ గాయాన్ని బట్టి చూస్తే- సుదీర్ఘ కాలం పాటు రిహాబిలిటేషన్‌ను ఎదుర్కొనాల్సి రావొచ్చని న్యూస్ హబ్ తెలిపింది. అక్టోబర్‌లో ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్ ఉన్నందున అతను త్వరగానే కోలుకుంటాడని అభిమానులు ఆశిస్తోన్నారు.












Click it and Unblock the Notifications