IPL 2023 : కొహ్లీ నినాదాలే వరంగా మార్చుకున్నా-ముంబైపై 4 వికెట్లు తీశాక నవీనుల్ హక్..
ఐపీఎల్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ లో భాగంగా ఇప్పటికే తొలి క్వాలిఫయర్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మరో క్వాలిఫయర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదాలు మాత్రం ప్లే ఆఫ్ దశలోనూ ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీకీ, లక్నో సూపర్ బౌలర్ నవీనుల్ హక్ కూ మధ్య గతంలో జరిగిన వాగ్వాదాన్ని అభిమానులు మర్చిపోలేదు.
నిన్న చెన్నై చేపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ కూ, ముంబై ఇండియన్స్ కూ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. లక్నో తరఫున బౌలర్లలో నవీనుల్ హక్ 4 వికెట్లు తీశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో నవీనుల్ హక్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో ప్రేక్షకులు విరాట్ కొహ్లీ నినాదాలతో హోరెత్తించారు. దీనిపై నవీనుల్ హక్ స్పందించకుండా సంయమనంగానే ఉన్నాడు.

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ గా, మాజీ కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి ఉన్న క్రేజ్ ఆప్ఘనిస్తాన్ ఆటగాడైన నవీనుల్ హక్ కు తెలియంది కాదు. దీంతో చేపాక్ స్టేడియంలో ప్రేక్షకులు విరాట్ కొహ్లీ నినాదాలతో తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా, ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించినా చలించలేదు. చివరికి 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి నవీనుల్ హక్ సత్తా చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీనిపై అడిగిన ప్రశ్నకు నవీనుల్ హక్ ఆసక్తికరంగా స్పందించాడు.
స్డేడియంలో విరాట్ కొహ్లీ నినాదాలపై స్పందిస్తూ నవీనుల్ హక్.. తాను వాటిని ఎంజాయ్ చేశానన్నాడు. మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని (విరాట్ కోహ్లి) పేరు లేదా మరే ఇతర ఆటగాడి పేరును జపించడం తనకు ఇష్టమని, ఇది తన జట్టు కోసం బాగా ఆడాలనే ఆసక్తి కలిగిస్తుందన్నాడు. తాను బయట నుంచి వచ్చే శబ్దాలపై దృష్టి పెట్టబోనని, తన ఆటపైనే దృష్టిపెడతానన్నాడు. ఇలాంటి నినాదాలు తనను ప్రభావితం చేయలేవన్నాడు. ఇదంతా ఆటలో భాగమేనన్నాడు.












Click it and Unblock the Notifications