రాయల్ ఛాలెంజర్స్‌లో భారీ ప్రక్షాళన- వారిద్దరూ అవుట్..?!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఛాంపియన్‌గా ఆవిర్భవించలేని జట్టు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచీ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐపీఎల్ 2023లో కూడా ఆరంభం అదరగొట్టింది గానీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి పరిమితమైంది.
ఆర్సీబీలో ఉన్న వారందరూ స్టార్ ప్లేయర్లే. అందులో సందేహాలు అక్కర్లేదు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, ఫిన్ అల్లెన్, అనూజ్ రావత్.. ఇలా దాదాపుగా ఆల్‌రౌండర్లతో తొణికిసలాడే జట్టు అది. మెగా ఆక్షన్స్ నిర్వహించిన ప్రతీసారీ.. మెరికల్లాంటి ప్లేయర్లను ఏరికోరి జట్టులోకి తీసుకుంటుంది. అయినప్పటికీ- అదృష్టం కలిసి రావట్లేదు. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించిన పాపాన పోలేదు.

ఈ పరిస్థితుల మధ్య- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకోనుంది. జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేయనుంది. వారిద్దరి కాంట్రాక్టులను ఇప్పటివరకు రెన్యూవల్ చేయలేదు ఆర్సీబీ ఫ్రాంఛైజీ. సెప్టెంబర్‌లో మైక్ హెస్సన్, సంజయ్ బంగర్ కాంట్రాక్ట్ ముగియాల్సి ఉంది.
సాధారణంగా జులై లేదా ఆగస్టులో కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేస్తుంటుందా మేనేజ్‌మెంట్. ఇప్పటివరకు రెన్యూవల్ దిశగా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోవలేదు. ఫలితంగా మైక్ హెస్సన్, సంజయ్ బంగర్‌ను సాగనంపుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జట్టును ఫైనల్స్ వరకు చేర్చడంలో విఫలమౌతోన్న కారణంగానే కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేయాలని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆగస్టు 2019లో కోచింగ్ స్టాఫ్‌గా ఆర్సీబీలో ఎంట్రీ ఇచ్చాడు మైక్ హెస్సన్. హెడ్ కోచ్‌గా సైమన్ కటిచ్ ఖాళీ చేసిన స్థానాన్ని 2022లో సంజయ్ బంగర్ భర్తీ చేశాడు. హెస్సన్ ఆధ్వర్యంలో.. ఆర్సీబీ 2020 ఐపీఎల్ సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. 2022లో ఎలిమినేటర్ గెలిచి, ఫైనల్స్‌పై ఆశలు రేకెత్తించినప్పటికీ.. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది ఆర్సీబీ. మళ్లీ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఆరో స్థానమే దక్కింది.












Click it and Unblock the Notifications