వర్షాకాలం.. పాముల కాలం: పొలాల్లో రైతులే కాదు మీరు కూడా.. పదిలం!!
వేసవి తాపం నుంచి ఉపశమనం ఇచ్చే కాలం వర్షాకాలం. రైతులకు అతి ముఖ్యమైన కాలం వర్షాకాలం. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో వర్షాలతో అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకృతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాలలో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాకాలం కావడంతో విషకీటకాలు కూడా విజృంభిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వర్షాకాలంలో వర్షాలు కురవడం వల్ల పాములు పుట్టలలో నుంచి బయటకు వచ్చి బయట సంచరిస్తూ ఉంటాయి. బాగా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులలో, గడ్డివాములలో, పొలాల వద్ద పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే వ్యవసాయం చేయడానికి పొలాలకు వెళ్లే రైతులు పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే ఎక్కడైనా అడుగు వేయాలి.
వర్షాకాలంలో ఇంట్లో చిందరవందరగా సామాను పడవేసినా, పరిసరాల్లో ఎక్కువగా పాములు నివాసం ఉండడానికి కావలసిన అనుకూలమైన ప్రదేశాలు ఉన్నా ఖచ్చితంగా అక్కడ పాములు వచ్చి చేరుతాయి. ఇక శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, బాగా పాడు పడిపోయిన పాఠశాలల వద్ద కూడా పాములు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్కూల్స్ వద్ద పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలి.
పాముకాటుకు గురి కాకుండా రైతులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే పాముకాటుతో మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటి చుట్టు పక్కల చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. కుప్పలు కుప్పలుగా వస్తువులు, రాళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని మాత్రమే వెళ్లాలి. ఇంట్లోకి పాములు రాకుండా కిటికీలు తలుపులు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంటి నుండి నీరు బయటకు వెళ్ళటానికి ఉండే చిన్న చిన్న రంధ్రాలను సైతం పాములు రాకుండా మూసివేయాలి.












Click it and Unblock the Notifications