100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణా.. పోటీలో గెలిస్తే లక్షల బహుమతులు!
తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. టూరిజం శాఖ 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో పర్యాటక ప్రియులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఈ వినూత్న కార్యక్రమంలో తెలంగాణ లోని అద్భుత పర్యాటక ప్రాంతాలను, ఇంతవరకు ఎవరు కనుగొనని అందాలను, ఆకర్షణీయమైన ప్రదేశాలను ప్రజలకు చూపించనుంది.
పర్యాటక ప్రాంతాల పోటీ.. వారికి బహుమతులు
వారాంతంలో విహారానికి వెళ్లడానికి అనువైన ప్రత్యేక గమ్యస్థానాన్ని ప్రజలకు పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పోటీ ద్వారా ఎవరైతే అద్భుతమైన, ఇప్పటివరకు ఎవరికీ తెలియని పర్యాటక ప్రదేశాలను ఫోటోలు, వీడియోలు, కథనాల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటారో వారికి అద్భుతమైన బహుమతులను ఇవ్వడానికి నిర్ణయించింది.

చెయ్యాల్సింది ఇదే
ఇప్పటివరకు జనాలకు తెలియని రాష్ట్రంలోని 100 ప్రత్యేక వీకెండ్ డెస్టినేషన్ లను సందర్శించి ఆ వీడియోలను, ఫోటోలను, కథనాలను సోషల్ మీడియాలో పంచుకొని ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతను, ప్రకృతి సౌందర్యాన్ని, చారిత్రక ప్రాధాన్యతను, స్థానిక సంస్కృతి, ఆహారపు అభిరుచి వంటి అనేక అంశాలను ప్రదర్శించేలా కంటెంట్ రూపొందించాలి. పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఇందులో ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి విజేతలను ప్రకటిస్తుంది.
లక్షల రూపాయల నగదు బహుమతులు
ఇక ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 50వేల రూపాయలు రెండవ బహుమతిగా 30 వేల రూపాయలు, మూడో బహుమతిగా 20వేల రూపాయలు ఇస్తారు. మరో 10 కన్సోలేషన్ బహుమతులు కూడా అందిస్తారు. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసే సృజనాత్మక కంటెంట్ కు గుర్తింపు లభించడంతోపాటు, పర్యాటక రాయబారులు గా మారే అవకాశం వస్తుంది. పర్యాటక రంగం పైన ప్రధానంగా ఫోకస్ చేసే యువతకు ఇది ఒక పెద్ద వేదికగా నిలుస్తుంది.
ఈ పోటీతో బెనిఫిట్ ఇదే
ఇక ఈ పోటీ ద్వారా ఇప్పటివరకు ప్రజలు పెద్దగా గుర్తించని పర్యాటక ప్రదేశాలను తెలుసుకోగలుగుతారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి చూసే ఆలోచనలు చేస్తారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ప్రాంతాలను తెలుసుకోవడంతో పాటు వాటి అభివృద్ధికి, ఆయా ప్రాంతాలలో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేయడానికి పర్యాటక రంగానికి అవకాశం ఇస్తుంది.












Click it and Unblock the Notifications