వరంగల్ కు బండి సంజయ్? బీజేపీనేతల అరెస్టులు, హౌస్ అరెస్టులు; రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకేజీ రచ్చ కొనసాగుతూనే ఉంది. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ మొదటిరోజు తెలుగు పేపర్ లీక్ కాగా, రెండవ రోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ పరీక్ష సమయంలో బయటకు రావడం బండి సంజయ్ ను అరెస్టు చేసేదాకా వెళ్ళింది .
పరీక్ష పత్రాన్ని వాట్సప్ గ్రూపులలో పంపించిన మాజీ విలేకరిగా పనిచేసిన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీకి అనుకూలంగా పని చేసే వ్యక్తి అని, బండి సంజయ్ కి ఫోన్ చేశాడని, మొత్తం ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ గ్రూప్ లలో పెట్టిన తర్వాత ప్రశాంత్ తన ఫోన్ నుండి 145 ఫోన్ కాల్స్ చేశారని పోలీసులు వెల్లడించారు. పరీక్ష పత్రం లీక్ అవడం వెనుక బిజెపి హస్తముందని భావించి ప్రశాంత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే బండి సంజయ్ తో ఫోన్లో మాట్లాడినంత మాత్రాన, బండి సంజయ్ తో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన ప్రశ్నాపత్రం లీకేజ్ కు బండి సంజయ్ కు ఏం సంబంధం ఉంటుందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. ప్రశాంత్ బి ఆర్ ఎస్ నేతలతో కూడా కలిసి ఫోటోలు దిగాడని, వారందరినీ కూడా అరెస్టు చేయాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి మధ్య కొనసాగుతున్న రచ్చ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

బండి సంజయ్ ని విడుదల చేయాలని బిజెపి నేతలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తుంటే, బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అన్ని జిల్లాలలో హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నిన్న అర్దరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్లో ఉన్న బండి సంజయ్ ను మొదట భువనగిరిలో ఉన్న కోర్టులో హాజరు పరుస్తారని భావించినప్పటికీ బండి సంజయ్ వాహనాన్ని హనుమకొండ వైపుకు మళ్ళించారు పోలీసులు .
ఇక ఆలేరు సమీపంలో బండి సంజయ్ ను తీసుకు వెళుతున్న పోలీసులను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పాలంటూ నినాదాలు చేసి వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ బిజెపి నాయకులు బయటకు రాకుండా హౌస్ అరెస్టులు, అరెస్టులు చేస్తున్న పోలీసులు బండి సంజయ్ ను వరంగల్ కు తీసుకు వెళ్తున్నట్టు సమాచారం. వరంగల్లో బండి సంజయ్ పై కేసు నమోదు అయిన కారణంగా వరంగల్ కోర్టులో బండి సంజయ్ ను హాజరు పరచనున్నట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications