ఇదేం మాయరోగం: 13 ఏళ్ల బాలికకు గుండెపోటు, కాసేపటికే మృతి
వరంగల్: ఇటీవల కాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్న వయస్సు వారికి కూడా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రావడం మరింత ఆందోలనకు గురిచేస్తోంది. ఇటీవల 30 ఏళ్లలోపు యువకులు కూడా కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఓ 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించడం ఆమె కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మరిపెడ మండలం బోడతండాకు చెందిన బోడ లక్‌పతి-వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో సంతానమైన స్రవంతి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.

శ్రీరామ నవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తోటి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు తండాలో ఆడుకుంది. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి నాయనమ్మ వద్ద నిద్రించింది. అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఛాతిలో ఏదో ఇబ్బందిగా ఉందంటూ నానమ్మను లేపింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలింది.
ఏం జరిగిందో అర్థంకాక ఆ మహిళ వెంటనే కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆ బాలిక చనిపోయిందని ఆర్ఎంసీ డాక్టర్ చెప్పాడు. అయితే, దాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి బాలికను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధృవీకరించడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని తాండాకు తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. బాలిక మృతితో ఆమె కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications