70కోట్లతో అందాల సరస్సులో అద్దాల వంతెన.. ఐ ల్యాండ్ కూడా.. ఎక్కడంటే!
చారిత్రక నగిరి ఓరుగల్లు సిగలో మరొక కలికితురాయి చేరనుంది. కాకతీయులు పాలించిన ఓరుగల్లులో కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువు అయిన అందాల భద్రకాళి చెరువులో అద్దాల వంతెన రాబోతుంది. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరంగల్ నగరానికి పర్యాటకంగా శోభ తీసుకురావడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఓరుగల్లు నగరవాసులకు శుభవార్తలా అనిపిస్తుంది.
ఓరుగల్లుకు పర్యాటక శోభ తెచ్చే ప్లాన్
హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అంత ప్రాధాన్యత ఉన్న ఓరుగల్లు నగరంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి కాకతీయుల కాలంనాటి కట్టడాలు మినహాయించి పెద్దగా ఆహ్లాదం నింపే ప్రదేశాలు లేవు. ఈ క్రమంలోనే భద్రకాళీ చెరువుని మరింత అభివృద్ధి చేసి అందులో ఒక ఐలాండ్ నిర్మించి దాని చుట్టూ భద్రకాళి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మాడవీధులతో కలిపే ఒక కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా అధికారులు ప్లాన్ చేశారు.

భద్రకాళి చెరువులో ఐలాండ్ నిర్మాణం
అందులో భాగంగా ప్రస్తుతం భద్రకాళీ చెరువు వద్ద శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మాడ వీధుల నిర్మాణంతోపాటు, భద్రకాళి చెరువులో ఐలాండ్ నిర్మాణం కూడా చేయనున్నారు. అంతేకాదు ఈ అందాల చెరువు పైన భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్ వే, మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్ట్ అమలు కోసం అడుగులు పడుతున్నాయి.
రోప్ వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు
దీనికి సంబంధించి పది సంవత్సరాల ప్రతినిధులు తమ ప్రజెంటేషన్ లను కుడా అధికారుల ముందు సమర్పించారు. ఈ ప్రజెంటేషన్ లను కాకతీయ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ చాహత్ బాజ్ పాయ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోప్ వే మరియు గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, నగర సౌందర్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు.
70 కోట్ల రూపాయల ఖర్చుతో స్కైవాక్ అద్దాల వంతెన
రోప్‌వే నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.దీని నిర్మాణానికి 70 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. భద్రకాళి చెరువులో స్కైవాక్ అద్దాల వంతెనను నిర్మిస్తే ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా అందాల చెరువులో అద్దాల వంతెన పైన నడుస్తూ అనుభూతి చెందాలని ఓరుగల్లు వాసులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications