జూబ్లీహిల్స్ ఎపిక్ సెంటర్: రాజుకున్న వేడి
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు.. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఆశావహులు.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తోన్నారు.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను ఇదివరకే వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థినీ ప్రకటించింది కూడా. గోపీనాథ్ భార్య మాగంటి సునీత గోపీనాథ్ ను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందా పార్టీ. భారీ వర్షాల నేపథ్యంలో విలవిల్లాడుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఉదయం నుంచి విస్తృతంగా పర్యటిస్తోన్నారు.
షేక్ పేట్, సమత కాలనీ, రహ్మత్ నగర్ వంటి ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటిస్తోన్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్లను కలుస్తోన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటోన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వారికి వివరిస్తోన్నారు. అలాగే- ఇప్పటివరకు పెట్టిన బకాయిలతో రూపొందించిన కార్డులను ఆయన ఓటర్లకు అందజేస్తోన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రూపంలో మంచి అవకాశం దొరికిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసేందుకు బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు. ఎన్నో మోసపూరిత హామాలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వాటన్నింటినీ తాము ఇప్పుడు ఓటర్లకు గుర్తు చేస్తోన్నామని పేర్కొన్నారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేదనే విషయాన్ని ఓటర్లకు వివరిస్తోన్నామని, ప్రభుత్వంపై వారిలో తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications