క్షమాపణ చెప్పినా మంత్రి కొండా సురేఖను వదిలేలా లేరుగా!
తెలంగాణ మంత్రి కొండ సురేఖ అక్కినేని కుటుంబం పైన, హీరోయిన్ సమంత పైన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. కొండా సురేఖ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో నాగార్జున ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. నాగచైతన్య సమంతల విడాకుల గురించి ఎవరు ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కొండ సురేఖ.
భగ్గుమన్న అక్కినేని ఫ్యాన్స్
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యలతో అక్కినేని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అక్కినేని ఫ్యాన్స్ కొండా సురేఖ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. నిన్నటికి నిన్న వరంగల్లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు వరంగల్ లో మంత్రి పర్యటిస్తుండగానే మరోవైపు మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి సమంతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాష్ట్రాలలో కొండా సురేఖ దిష్టిబొమ్మ దగ్ధం
ఇక తాజాగా నెల్లూరులోనూ అక్కినేని అభిమానులు కొండా సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇటు అక్కినేని ఫాన్స్ మాత్రమే కాదు బిఆర్ఎస్ మహిళా విభాగం కూడా రాష్ట్రవ్యాప్తంగా కొండా సురేఖ దృష్టి బొమ్మలను దగ్ధం చేసింది. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు తెలుగు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని బిఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మండిపడుతున్నారు. ఆమె దిష్టిబొమ్మలను కొండా సురేఖ బ్యానర్లను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి పదవి తొలగించాలని డిమాండ్
కొండ సురేఖ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఓవైపు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగి అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా స్పందించి తమను రాజకీయాల్లోకి లాగొద్దని ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. దీంతో కొండా సురేఖ కేటీఆర్ ని విమర్శిస్తున్న క్రమంలో భావోద్వేగానికి లోనై తను వ్యాఖ్యలు చేశానని తనను క్షమించాలని సమాధానం ఇచ్చారు.
సోషల్ మీడియాలో కీర్తిశేషులు కొండా సురేఖ
అంతలోనే మళ్లీ నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్పిన కొండ సురేఖ సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నేను చెప్పిన కారణం కాకుంటే మరేం జరిగిందో ఎందుకు విడిపోయారో నాగార్జున చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇక కొండా సురేఖ ధోరణి మారదని మరోమారు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ ఆమె ఫోటోలతో పోస్టులు పెడుతున్నారు. కారుకూతల కొండా సురేఖ.. నోటి దురద కొండా సురేఖ అంటూ సురేఖ పైన నిప్పులు చెరుగుతున్నారు.












Click it and Unblock the Notifications