మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అక్కినేని నాగార్జున
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున ఖండించారు. రాజకీయాలకు సినీ ప్రముఖులు దూరంగా ఉంటారని, మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు సినీ ప్రముఖులను వాడుకోవద్దన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉన్న మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం.. అబద్దం.. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సింది కోరుతున్నానంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
వారిద్దరూ విడిపోవడానికి కేటీఆరే కారణం
ఉదయం మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగచైతన్య-సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి, సమంత జీవితం అన్యాయం కావడానికి కేటీఆర్ కారణమని తాను ఓపెన్ గా చెబుతున్నానన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బెదిరించి, వారికి మత్తుమందులు అలవాటు చేయడంతోపాటు తాను కూడా మత్తుమందులు వాడాడని కొండా సురేఖ చెప్పారు. కేటీఆర్ కు తీవ్రస్థాయిలో మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, కొంతమంది హీరోయిన్లు పరిశ్రమ నుంచి వెళ్లిపోవడానికి అతనే కారణమని, మరికొందరు త్వరగా పెళ్లిళ్లు చేసుకున్నారని, దీనికి కారణం కేటీఆర్ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.

త్వరలోనే అరెస్ట్ చేస్తాం
గతంలో తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పాంకానీ ఇంతవరకు బయటకు మాట్లాడలేదని, కానీ తనపై వ్యక్తిగతంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్ చేయడంతోపాటు తనపట్ల అసభ్యకరంగా పోస్టులు చేస్తుండటంతో స్పందించాల్సి వస్తుందన్నారు. దుబాయ్ నుంచి మూడు ఖాతాలద్వారా తనపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ లో కేసులు పెట్టామని, అలాగే పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు పెట్టామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని మంత్రి ప్రకటించారు.












Click it and Unblock the Notifications