ఆరోరోజు అలిగిన బతుకమ్మ .. ఎందుకు బతుకమ్మ ఆడరో తెలుసా!!
తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణా పూల వైభవం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగలో బతుకమ్మలను పేర్చి ఆడి పాడి సంబరాలు జరుపుకుంటారు. గౌరీదేవిని విశేషంగా పూజిస్తారు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీత జడలు, రుద్రాక్షలు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తొమ్మిది రకాల నైవేద్యాలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలు రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మగా, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మగా, ఐదవ రోజు అట్ల బతుకమ్మగా అంగరంగ వైభవంగా సాగింది. ఇక నేడు ఆరవ రోజు బతుకమ్మ పండుగను ఎవరు జరుపుకోరు. ఈరోజు ఎవరూ బతుకమ్మను పేర్చి పూజలు చేయరు. ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుచుకుంటారు.

ఎందుకు ఆరో రోజు అలిగిన బతుకమ్మగా చెబుతారు. ఎందుకు ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు? అంటే దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు.
ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్వరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
మొత్తం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలతో, ప్రకృతిలోని పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించి, చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఇక మహిళలు పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ సమిష్టిగా ఒక చోట కూడి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications