అల్లు అర్జున్ సినిమాలో సీఎం రేవంత్ రెడ్డి.. నెట్టింట వీడియో హల్ చల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప సిరీస్ తో అటు పాన్ ఇండియా రేంజ్ లోనూ భారీగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో డాన్స్, ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. 2003 లో గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్ సినీ కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత 2004 లో ఆర్య, దేశముదురు, బన్ని, పరుగు లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.
ఆ తర్వాత రేసు గుర్రం, జులాయి, సరైనోడు చిత్రాలతో అలరించి.. అల వైకుంఠ పురములో చిత్రంతో తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అల్లు అర్జున్. ఆ తర్వాత వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా పుష్ప 2 నిలవడం విశేషం. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో రాకా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే..? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత సినిమాలో ప్రస్తుత రాజకీయ ప్రముఖుడికి సంబంధించిన విజువల్స్ వెలుగులోకి రావడంతో అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ పరుగు (2008).. అయితే ఈ సినిమాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఓ పోస్టర్ కనిపించడం విశేషం.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ ప్రకారం.. అల్లు అర్జున్, హీరోయిన్ షీలా ఒక బస్ స్టాండ్ లో కూర్చుని ఉంటారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది యువకులు హీరోయిన్ పై అసభ్యంగా మాట్లాడుతుంటారు. అది విన్న అల్లు అర్జున్.. డైరెక్ట్ గా హీరోయిన్ ను కాకుండా పక్కనే ఉన్న తన ఫ్రెండ్ సునీల్ కు చెంపపై కొట్టి హీరోయిన్ ను అలర్ట్ చేస్తాడు. అయితే ఈ సీన్ లో హీరోయిన్ వెనుక ఒక పొలిటికల్ పోస్టర్ కనిపిస్తుంది.
ఆ పోస్టర్ ను నిశితంగా గమనిస్తే.. అందులో ఉన్నది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆ పోస్టర్ అనుకోకుండా రికార్డు అయినట్లు తెలుస్తోంది. ఇక అప్పట్లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications