Telangana: నిండిన ప్రాజెక్టులు.. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు..
తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర పరిధిలోని గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. ఈ ప్రాజెక్టులోకి 99,920 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 85, 840 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1, 091 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1,090 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీట మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 796.4 అడుగులుగా ఉంది. కడెంలోకి 14,455 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. 10,587 క్యూ సెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. అధికారులు 4 గేట్ల ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కడెం నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీసీఎంసీల నీరు ఉంది. శ్రీరాం సాగర్, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఈ జలాశయం పూర్తి స్థాయి సమర్థ్యం 20.15 టీఎంసీలు కాగా. ప్రస్తుతం 18.110 టీఎంసీల నీరు ఉంది.
హైదరాబాద్ మెట్రో వా టర్ వర్క్స్ పథకానికి 311 క్యూసెక్కులు నీరు కూడా అందిస్తున్నారు. కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యామ్ భారీ వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు డ్యామ్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేర్ డ్యాం నుండి 32 వేల క్యూసెక్కులు, మోయతుమ్మెద వాగు నుంచి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుంది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇరు జలాశయాల రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ కు 4000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. మరో 4 గేట్ల ద్వారా 4120 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.50 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మరో 4 గేట్ల ద్వారా 1380 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications