రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాయిస్ ఎవరు?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాయిస్ రేవంత్ రెడ్డి. రెండో పేరు గురించికానీ, రెండో నేత గురించికానీ ఆయన ఆలోచించలేదు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ కు హాజరైనప్పుడుకానీ, భారత్ జోడో యాత్రలోకానీ.. ఎటువంటి కార్యక్రమం తెలంగాణలో జరిగినా రాహుల్ గాంధీ నుంచి ఫస్ట్ ఛాయిస్ గా రేవంత్ రెడ్డే నిలిచారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రేవంత్ వైపే మొగ్గారు. చేవెళ్లలో జరిగిన దళిత డిక్లరేషన్ సభకు హాజరైన సందర్భంలో రేవంత్ పనితీరు ఆయన్ను ఆకట్టుకుంది. అలాగే మొదటి నుంచి డీకే శివకుమార్ తో సమన్వయం చేసుకుంటూ పార్టీని విజయపథంలో నడిపించిన రేవంత్ రెడ్డి కాకుండా వేరే పేరు ఏదీ డీకేకు ఛాయిస్ గా కనిపించలేదు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సీఎల్పీ సమావేశానికి ముందు నాయకులతో చర్చించిన అంశాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్ఠానానికి అందజేశారు. అయితే హైకమాండ్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే మరోసారి అగ్రనేతలు సమావేశమయ్యారు.

ఇదే సమయంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ నాయకులను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరారు. రేవంత్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోనే ఉండిపోయారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, పరిశీలకులు డీకే, ఠాక్రే సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి పేరును ఖరారు చేయాలని రాహుల్‌గాంధీ సూచించగా, మిగిలిన వారు కూడా రేవంత్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
కేసీ వేణుగోపాల్, డీకే, ఠాక్రేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి అధిష్ఠానం నిర్ణయాన్ని వారికి తెలిపారు. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ్, భట్టిల సమక్షంలోనే రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా నిర్ణయించారు. 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఆ సమయాన్ని మార్చారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications