బీఆర్ఎస్ కు బిగ్ షాక్: మంత్రి ఎర్రబెల్లి ఓటమి!!
అనుకున్నదే జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతిపెద్ద వయస్కురాలైన ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. సుమారు 14 వేల మెజారిటీతో యశస్విని రెడ్డి ఘనవిజయం సాధించారు. అధికారికంగా ఇంకా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. పాలకుర్తి నియోజకవర్గం నుంచి హోరాహోరీగా తలపడిన యశస్విని రెడ్డి కౌంటింగ్ లో ఆది నుండి తన ఆధిక్యాన్ని కొనసాగించారు.
కౌంటింగ్ లో మొదటి నుంచి ఎదురీతను ఎదుర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు చివరిగా ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు పోటీ చేస్తున్న వివిధ స్థానాలలో వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. ఒక్క ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే కాకుండా మరో ఏడు స్థానాలలో మంత్రులు ఎదురీదారు.

అయితే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం ఫలితాలు వెల్లడి కాగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న వేళ, రాష్ట్రంలో మంత్రులుగా చలామణి అయిన నేతలకు కూడా షాక్ తప్పలేదు. మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల ఫలితాలలో చేదు అనుభవాన్ని చవి చూశారు. ఆయన తన ప్రత్యర్థి 26 సంవత్సరాల యశస్విని రెడ్డి దాటికి తట్టుకోలేక కుప్పకూలారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుండి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసినా మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది.
నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ప్రజల నుండి ఆయన తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారిందని, అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయిందని తెలుస్తుంది.
ఏది ఏమైనా ఇప్పటి వరకు మెజారిటీ ఎన్నికలలో ఓటమి ఎరుగని నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పరాజయం పాలయ్యారు. ఎర్రబెల్లి బాటలోనే తెలంగాణ రాష్ట్రంలో పలువురు మంత్రులు ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications