KCR బ్రో... BRS పెట్టినందుకు థాంక్స్ బ్రో: BJP
ఒక పార్టీకి వ్యతిరేకంగా మరో పార్టీ ఆవిర్భవించినప్పుడు, ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు అవతలివైపు పార్టీ నేతలు జాగ్రత్తపడతారు. తమ లోపాలు, బలహీనతలు సరిదిద్దుకొని ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేలా తీర్చిదిద్దుకుంటారు. కానీ భారతీయ జనతాపార్టీ ఓటమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి, దేశ రాజధానిలో శరవేగంగా అడుగులు వేస్తున్న సమయంలో ప్రత్యర్థి పార్టీ అయిన భారతీయ జనతాపార్టీ మాత్రం సంబరపడుతోంది. బీఆర్ఎస్ వేసే ప్రతి అడుగు తమను అధికారం దిశగా నడిపిస్తుందనే అంచనాలో ఉన్నారు.

తెలంగాణ వరకే పనిచేస్తాయి
తెలంగాణపై కేసీఆర్ దృష్టి పెట్టడం తగ్గుతుందని, ఆమేరకు తాము తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. రాజకీయ వ్యూహాల్లో గండర గండడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ఏం మాట్లాడతారో, ఏ మాయ చేస్తారో అంటూ ప్రత్యర్థి పార్టీలు లోలోన ఆందోళన చెందుతుంటాయి. అయితే కేసీఆర్ కు ఉన్నటువంటి బలాలు తెలంగాణ రాష్ట్రం వరకే పనిచేస్తాయని, రాష్ట్రం దాటివచ్చిన తర్వాత పనిచేయవని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

స్థానిక శ్రేణులు పనిచేసే అవకాశాలు స్వల్పం?
అంతేకాకుండా బీఆర్ఎస్ వివిధ రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీచేస్తామని ప్రకటించింది. అంటే ఆయా పార్టీలు బీఆర్ఎస్ కు సీట్లు కేటాయిస్తాయి. అప్పుడు అక్కడ ఉన్న స్థానిక శ్రేణులు ఆ పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశాలు బహుస్వల్పమని, దీన్ని సదవకాశంగా మలచుకుంటే మిత్రపక్షాలు బీఆర్ఎస్ కు కేటాయించిన సీట్లలోను తమ పార్టీ అభ్యర్థులు, తమ మిత్రపక్షాల అభ్యర్థులే గెలుపొందడానికి అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

బీఆర్ఎస్ పై కేసీఆర్ ఎంత మనసు పెడితే అంత బీజేపీకి మంచి..
తెలంగాణలో ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ ... ఇప్పుడు తిరుగుతున్నట్లుగానే కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తుంటే కూల్ గా తాము తెలంగాణలో పనిచేసుకోగలుగుతామని భావిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఉన్నప్పటికీ కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరని, తాము కూడా తెలంగాణలో దూకుడుగా రాజకీయం చేయడానికి సమయం దగ్గరపడిందంటున్నారు. బీఆర్ఎస్ పై కేసీఆర్ ఎంత మనసు పెడితే తమకు అంత మంచిదన్న లెక్కల్లో బీజేపీ ఉంది.
చివరకు ఏమవుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications