ఈ ఒక్కసారి ప్లీజ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చలమల కృష్ణారెడ్డి విజ్ఞప్తి!!
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించడంతో మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, టికెట్ ఆశిస్తున్న వ్యక్తి చలమల కృష్ణారెడ్డికి షాక్ తగిలినట్లయ్యింది. రేవంత్ రెడ్డి వర్గం నేతగా ఉన్న ఆయన గత మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ అప్పుడు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అవకాశంపైన ఆయనలో ఆందోళన నెలకొంది.
గత ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ లోనే కొనసాగితే తనకు టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు చలమల కృష్ణారెడ్డి. అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ బాట పడుతున్నానని చెప్పడంతో ఆయన రాకను స్వాగతిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకను తాను స్వాగతిస్తున్న అని పేర్కొంటూనే ఈసారికి మునుగోడును తనకు వదిలెయ్యాలని చలమల కృష్ణారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా కింద పడకుండా తాను కాపాడుతానని, ఎందుకు తనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకరించాలని కోరుతున్నానన్నారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా బలమైన నాయకుడని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసిన గెలుస్తారని అన్నారు. పార్టీ ఆయనకు మరొకచోట సీటును కేటాయించాలని చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి వస్తే కాంగ్రెస్ మరింత బలపడుతుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న తనకు టికెట్ ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత ఉప ఎన్నికల సమయంలోనే టిక్కెట్ వస్తుందని ఆశించానని, కానీ తర్వాత ఇస్తామని చెప్పి పార్టీ పెద్దలు తనకు నచ్చ చెప్పారని చలమల కృష్ణారెడ్డి తెలిపారు. టికెట్ ఇస్తే పోటీ చేసేది లేదని కేవలం తనకు మునుగోడు నియోజకవర్గం మాత్రమే కావాలంటూ ఆయన పేర్కొన్నారు.
ఇక మునుగోడు టికెట్ పై అధిష్టానం నుంచి తనకు గుడ్ న్యూస్ వస్తుందని ఎదురు చూస్తున్నానని పేర్కొన్న ఆయన పెద్ద మనసుతో ఈసారి మునుగోడులో పోటీ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నానని రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి చలమల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications