రేవంత్ కు చంద్రబాబు మార్క్ షాక్ - బీజేపీ స్కెచ్ అమలు...!!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన అధికారం పైన భారీ అంచనాలతో ఉన్నాయి. జగన్ ఏపీలో గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తమ బలం పెంచుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక..తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయని చంద్రబాబు..ఇప్పుడు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
చంద్రబాబు తాజాగా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునఃనిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశానికి నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత చురుకుగా లేదు. అయితే పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.

గ్రేటర్ పై ఫోకస్
తెలంగాణలో పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా ముందుగా కొత్త అధ్యక్షుడి నియామకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి ఇప్పటికే పలువురు నేతలు పెద్దఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.చర్చల అనంతరం రాష్ట్రంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఏపీలో ఇంకా ఫలితాలు రాలేదు. ఇటు తెలంగాణలో పార్టీ విస్తరణ దిశగా చంద్రబాబు అడుగులు వేయటం వెనుక అంతర్యం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీతో కలిసి
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ కేడర్ పరోక్షంగా కాంగ్రెస్ కు సహకరించింది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సూచనల మేరకే టీడీపీ అధినేత అడుగులు వేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీని ద్వారా టీడీపీ తమ ఓట్ బ్యాంక్ తిరిగి దక్కించుకంటే..కాంగ్రెస్ ను దెబ్బ తీయవచ్చనేది బీజేపీ అంచనాగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి పాగా వేయాలనేది బీజేపీ లక్ష్యం. ఈ వ్యూహంలో భాగంగానే నగరంలో పట్టు పెంచుకొనేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిస్తే గ్రేటర్ పీఠం సులువుగా దక్కించుకోవచ్చనేది బీజేపీ వ్యూహం. టీడీపీ, బీజేపీకి ధీటుగా రేవంత్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications