ఆదివారం గిరాకీ లేక ఈగలు తోలుకుంటున్న చికెన్ వ్యాపారులు!
ఇంతకుముందు ఆదివారం వచ్చిందంటే చాలు. చికెన్ షాపులు కిటకిటలాడేవి. చికెన్ కొనుగోలుదారులతో బిజీ బిజీగా దుకాణాలు ఉండేవి. అటువంటిది ఇప్పుడు చికెన్ షాప్ లు వెలవెలబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ చికెన్ కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. చికెన్ కు బదులుగా మటన్ కొనుగోలు చేయడానికి, చేపలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం
చికెన్ షాప్ లలో మాత్రమే కాదు, హోటల్స్ లో కూడా చికెన్ తినాలంటే భయపడుతున్నారు. దీంతో వివిధ హోటల్స్ లో చికెన్ వంటలను తగ్గించి మటన్, ఫిష్ ఎక్కువ మొత్తంలో వండుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఈ క్రమంలో చికెన్ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

చికెన్ కొనాలంటే తగ్గిన ఆసక్తి
చికెన్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించటం లేదు 250 నుంచి 220 రూపాయల వరకు అమ్మే చికెన్ కొన్ని ప్రాంతాలలో 160 నుండి 180 వరకు విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. చికెన్ ధరలు బాగా తగ్గించి అమ్ముతున్నప్పటికీ కొనుగోలు చేస్తున్న నాధులు లేక దుకాణం దారులు ఈగలు తోలుకుంటున్నారు.
చికెన్ వ్యాపారులకు భయం
వైరస్ సోకిన కోళ్లను తినవద్దని వైరస్ సోకని కోడి మాంసాన్ని 70 నుంచి 100° ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ప్రభావం లేని ప్రాంతాలలో కోడి మాంసం తినవచ్చని చెబుతున్నప్పటికీ కోడి మాంసాన్ని కొనుగోలు చేసిన వారు ఎవరూ లేరు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ భయాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు భయపడుతున్నారు.
ఈగలు తోలుకుంటున్న చికెన్ షాపుల వ్యాపారులు
చాలా షాపులలో అధికారులు జరిపిన తనిఖీలలో కుళ్ళిపోయిన చికెన్ భారీగా బయటపడినట్లు సమాచారం. సుమారు 500 క్వింటాళ్ళ కు పైగా కుళ్ళిన చికెన్ ని చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు కుళ్ళిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఓవైపు బర్డ్ ఫ్లూ భయం మరోవైపు అధికారుల తనిఖీలు చికెన్ వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఆదివారం పూట కూడా వ్యాపారం లేకుండా వెలవెలబోతున్నట్టు కనిపిస్తున్న చికెన్ షాపులు తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications