జూబ్లీహిల్స్ ప్రచారంలోకి రేవంత్, తాజా సర్వేతో అలర్ట్ - సీన్ ఛేంజ్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీల నేతలు ఇక్కడే మొహరించారు. కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు కీలకంగా మారుతోంది. బీఆర్ఎస్ సైతం ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. గెలుపు పైన మూడు పార్టీల నేతలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. సర్వే నివేదికలు మాత్రం గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో, సీఎం రేవంత్ స్వయంగా ఈ ఎన్నిక ప్రచారంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. మంత్రులకు బాధ్యతలు కేటాయిస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్ లో మారుతున్న లెక్కలు ఫలితం పై ఉత్కంఠ పెంచుతున్నాయి.
జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు సీఎం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభ్యర్ధి విషయంలో రేవంత్ ఏరి కోరి ఎంపిక చేయటంతో పాటుగా.. పార్టీ నాయకత్వం.. ఎంఐఎంను ఒప్పించారు. ఇక, ఇప్పుడు గెలుపు కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందు కోసం మంత్రులతో ప్రత్యేకంగా భేటీకి నిర్ణయించారు. రేపు (శనివారం) సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.

అక్కడ ఏఐసీసీ ఆఫీసులో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. వచ్చిన తరువాత మంత్రులు.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేస్తున్న పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తాజా సర్వే నివేదికల గురించి సీఎం వివరించే అవకాశం ఉంది. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలకు ధీటుగా ఎలా ప్రచారం ముమ్మరం చేయాలనేది రేవంత్ డిసైడ్ చేయనున్నారు.
ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఒక్కో డివిజన్ కు ముగ్గురు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. అదే విధంగా ప్రతీ ఇంటికి ప్రచారానికి వెళ్లేలా కార్యాచరణ ఖరారు చేసారు. ఇక, ప్రచారం చివరి మూడు రోజులు రేవంత్ రోడ్ షోలు.. సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్దం చేస్తున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని పార్టీ నేతల సమావేశంలో ధీమా వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ కు కౌంటర్ గా చేయాల్సిన ప్రచారం పైన దిశా నిర్దేశం చేసారు. అటు బీజేపీ సైతం ముఖ్య నేతలను ప్రచారంలోకి దించేలా ఆలోచన చేస్తోంది. దీంతో.. తాజాగా వచ్చిన సర్వే నివేదికలతో.. సీఎం రేవంత్ ఎక్కడా అతి విశ్వాసం.. అజాగ్రత్త లేకుండా పక్క ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచిస్తున్నారు. ఈ మేరకు మంత్రులతో జరిగే భేటీలో జూబ్లీహిల్స్ ప్రచారం.. బాధ్యతల పైన రేవంత్ స్పష్టత ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications