ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్ సీరియస్!
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎంసీహెచ్ఆర్డీలోని బోధి భవన్లో వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి ఎందుకు మారడం లేదు? పంటలు చేతికొచ్చే వరకు కరెంట్ కోతలు ఉండకూడదు అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
వచ్చే 20 రోజులు వ్యవసాయానికి అత్యంత కీలకమని, పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీలు ఏర్పాటు చేసినా యాదాద్రి ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీతో పాటు సంబంధిత ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.

"ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. ఇబ్బందులు కలిగించే చర్యలను సహించను" అని అన్నారు. ఎల్నినోను కోవిడ్ లాంటి విపత్తుగా పరిగణించి జూన్ వరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులను నియమించి వర్షాభావం, విద్యుత్, తాగునీరు, పశుగ్రాసం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగానికి శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామసభలు, కళాజాతల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా చెప్పారు. గురువారం మంత్రులందరితో ఎల్నినోపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రైతులను ఈ కష్ట కాలంలో గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రైతులు పంట నష్టపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీటికి తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా సాయం అందిస్తామని చెప్పి రైతు నేస్తం వంటి కార్యక్రమాల ద్వారా వారికి దిశా నిర్దేశం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు.













Click it and Unblock the Notifications
