ప్రియాంక సభ..రేవంత్ పక్కా ప్లాన్ : కీలక హామీల ప్రకటన..!!
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రియాంక పర్యటనకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రియాంక ద్వారా కాంగ్రెస్ వస్తే ఏం చేయనున్నదనే దానిపై స్పష్టత ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక కీలక ప్రకటన చేయనున్నారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో రానున్న రోజుల్లో తన పాత్ర ఎలా ఉండనుందీ ప్రియాంక క్లారిటీ ఇవ్వనున్నారు.
ప్రియాంక తొలి సభ: ప్రియాంకగాంధీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించాలని టీపీసీసీ భావిస్తోంది. ప్రియాంక బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.30కు బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి వస్తారు. ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందిస్తారు. తర్వాత ప్రసంగం ముగించుకుని సాయంత్రం 5.30కు హెలికాప్టర్‌లో బేగంపేట వెళ్లి.. అక్కడినుంచి ఢిల్లీకి ప్రయాణం అవుతారు. సభా వేదికపైన ప్రియాంక గంట పాటు ఉంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. యువ సంఘర్షణ సభలో ప్రియాంక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే హామీలపైన ప్రకటన చేయనున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలను, ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయనున్నదో స్పష్టతనివ్వనున్నారు. ''యువ సంఘర్షణ సభ'' పేరిట విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై పోరాట కార్యక్రమంగా టీపీసీసీ ఈ సభను నిర్వహిస్తోంది. ఈ సభలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రియాంక ద్వారా చెప్పించి.. నిరుద్యోగులను ఆకర్షించేలా టీపీసీసీ ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి.. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్.. యువతకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను రైతుల్లోకి ఎలా తీసుకెళ్లారో యూత్ డిక్లరేషన్‌ను యువత వద్దకు అలానే తీసుకెళ్లాలని భావిస్తోంది.

తెలంగాణ బాధ్యతలపై: ప్రియాంక హాజరువుతున్న సభ కావటంతో టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎలా కల్పిస్తుందన్నది ప్రధానంగా ప్రియాంక హామీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటించే యూత్ డిక్లరేషనే ప్రధాన ఆకర్షణ కానుంది. ప్రియాంక సభకు యూనివర్సిటీలు, కళాశాలల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా ప్రియాంక ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యతల విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. కొంత కాలంగా తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ గా ప్రియాంక బాధ్యతలు తీసుకుంటారనే అంశం పైనా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications