క్షణకాలం ఆనందం కోసం ప్రాణాలు తీస్తారా?, కనీస స్పృహ ఉండక్కర్లేదా?
హైదరాబాద్ పోలీస్ కమిషన్ వీసీ సజ్జనార్ నగర వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక తనిఖీలు ఏడాదంతా ఇలానే కొనసాగుతాయని తేల్చి చెప్పారు. క్రయవిక్రయాలపై నిరంతర నిఘా ఉంచి, దాడులు నిర్వహిస్తామని, ఈ ఏడాది ప్రమాదాలు తగ్గినా.. జరిగిన కొద్దిపాటి ఘటనలూ ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. పర్యావరణానికే కాదని, పక్షుల పాలిట యమపాశంలా మారుతున్నాయని గుర్తు చేశారు.
చైనా మాంజాల గురించి ఆయన తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన సంక్రాంతి వేడుకల సంబరాల వేళ తీరని విషదాన్ని మిగల్చుతున్నాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. దీనికి చైనా మాంజా కారణమౌతోందని అన్నారు. నింగిలోకి గాలిపటాలను పంపి మురిసిపోవడమే కాదని, చేతిలోని ఆ ప్లాస్టిక్ దారం దారినపోయే వారి పాలిట యమపాశంలా మారుతోందన్న కనీస స్పృహ ఉండక్కర్లేదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి ఘటనలు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని సజ్జనార్ అన్నారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు సైతం ఆ పదునైన దారం బారిన పడుతున్నాయని, అవి రెక్కలు తెగి విలవిల్లాడి ప్రాణాలు విడుస్తున్నాయని అన్నారు. నిషేధం ఉన్నా కూడా చైనా మాంజాను దొంగచాటుగా అమ్మేవారందరూ నేరస్తులేనని ఆయన తేల్చి చెప్పారు. నిషేధం ఉందనే విషయం తెలిసి కూడా వాటిని కొని, పదిమంది ప్రాణాలతో చెలగాటమాడేవారూ అంతే బాధ్యులని అన్నారు.
క్షణకాలం ఆనందం కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా అని సజ్జనార్ మండిపడ్డారు. చైనా మాంజా బారిన పడి ఆసుపత్రుల పాలైన వారికి, అసువులు బాసిన వారికి ఎవరు జవాబుదారీ వహిస్తారని అన్నారు. బాధితుల కుటుంబాల్లోని ఆర్తనాదాలు ఒక్కసారి వినండి.. వారి ఆవేదనను మీదిగా భావించండి. ఇప్పటికైనా చైనా మాంజాను విడనాడండి.. సాటి మనుషుల పట్ల బాధ్యతగా మెలగండి.. అని హితవు పలికారు.
సోషల్ మీడియా ద్వారా చేపట్టిన #SayNoToChineseManja ప్రచారం.. పోలీసుల స్పెషల్ డ్రైవ్ వల్ల గత సంక్రాంతితో పోలిస్తే ఈ సారి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని సజ్జనార్ తెలిపారు. నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వాటి విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు ఏడాదంతా ఇలానే కొనసాగుతాయని చెప్పారు. చైనా మాంజా క్రయవిక్రయాలపై నిరంతర నిఘా ఉంచి, దాడులు నిర్వహిస్తామని, ఈ ఏడాది ప్రమాదాలు తగ్గినా.. జరిగిన కొద్దిపాటి ఘటనలూ ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి ఒక్క ప్రమాదం కూడా జరగకూడదన్నదే తమ లక్ష్యమని వివరించారు.












Click it and Unblock the Notifications