కాంగ్రెస్‌కు మరో షాక్: దాసోజు శ్రవణ్ రాజీనామా, రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రకటించారు. అంతేగాక, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్.

రేవంత్‌తో అరాచక పరిస్థితులంటూ దాసోజు శ్రవణ్
శుక్రవారం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచక పరిస్థితులున్నాయన్నారు. రేవంత్ తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతోందన్నారు. ఏఐసీసీ నుంచి ఫ్రాంఛైజీ తీసుకున్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, మాణికం ఠాకూర్, సునీల్ ముగ్గురూ కుమ్మక్కయ్యారన్నారు.

రేవంత్‌కు ధనం, కులమే ప్రధానం: బానిసగా ఉండలేనన్న దాసోజు
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ధనం, కులం ప్రధానం అయ్యాయన్నారు దాసోజు శ్రవణ్. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవని అన్నారు. రేవంత్ రెడ్డి.. బీసీలు నాయకులుగా కాదు బానిసలుగా ఉండాలంటున్నారన్నారు.
తాను బానిసగా ఉండలేనని, బానిసగా ఉండేందుకు రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఇటీవల రాహుల్ గాంధీతో జరిగిన భేటీలోని పార్టీలోని సమస్యలు తెలిపినట్లు శ్రవణ్ చెప్పారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలపై సర్వేల పేరుతో.. తప్పుడు నివేదికలు పంపుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా: ఏ పార్టీలో చేరాలనేది చెబుతానన్న దాసోజు
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నందుకు తనకు కూడా బాధగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు. అయితే, తాను ఇంకా ఏ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలోనే చెబుతానన్నారు. ఎక్కడ ఉన్నా తాను సామాజిక న్యాయం కోసం పోరాడతానని శ్రవణ్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డిని మేడిపండుతో పోల్చుతూ శ్రవణ్ ఫైర్
కేసీఆర్ అరాచక పాలనపై రేవంత్ పోరాటం చేయడం లేదన్నారు శ్రవణ్. ప్రైవేట్ ప్రాపర్టీగా పార్టీని రేవంత్ చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఒక్క మాటలో మేడిపండుతో పోల్చుతున్నట్లు తెలిపారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తూ సభలు పెడుతున్నారని.. ఈలలు వేసేందుకు, టపాసులు పేల్చేందుకు ఓ టీం ఉంటుందని చెప్పారు. పీజేఆర్ పెద్ద నాయకుడని, ఆయన కూతురు పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమస్య లేదన్నారు.












Click it and Unblock the Notifications