మోహన్ బాబు హెల్త్ బులెటిన్: కంటి కింద గాయం- ప్లాస్టిక్ సర్జరీ..?!
Mohan Babu health bulletin: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే కాంటనెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్సను అందిస్తోన్నారనే విషయాన్నీ వెల్లడించారు.
మంగళవారం రాత్రి 8:30 గంటలకు మోహన్ బాబు స్పృహ తప్పిన కాంటినెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన బాడీ పెయిన్స్, యాంక్జయిటీతో బాధపడుతున్నట్లు వ్యక్తిగత సహాయకులు డాక్టర్లకు వెల్లడించారు. వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహించారు.

ఆ సమయంలో ఎడమ కంటి కింద గాయం ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. బ్లడ్ ప్రెషర్ అధికంగా రికార్డయిందని, గుండె చప్పుడు వేగం అమితంగా ఉందని వివరించారు. హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ కనిపించాయని తెలిపారు. దీనితో వెంటనే మోహన్ బాబును హైబీపీ, హార్ట్ స్పెషలిస్టులతో వైద్య చికిత్సను అందించినట్లు చెప్పారు.
ప్రస్తుతం మోహన్ బాబు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని అన్నారు. ఈ టీమ్‌లో కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, ఇతర ఫిజీషియన్లు ఉన్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నామని, తదుపరి బులెటిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమా మౌనిక రెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి.
ఈ క్రమంలో జల్‌పల్లిలోని మంచు టౌన్ షిప్ వద్ద మంగళవారం రోజంతా హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. మంచు విష్ణు-మనోజ్‌కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు.
అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్నీ మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్‌పై దాడి చేశారు. మైక్‌తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలింది.












Click it and Unblock the Notifications