విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం!
కుక్కను విశ్వాసానికి మారుపేరుగా చెబుతారు. అటువంటి కుక్కలు తమ యజమానుల పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తాయి. ఒక్కొక్కసారి మనుషులుగా తోటి మనుషుల పైన మనం చూపించని విశ్వాసాన్ని కూడా కుక్కలు మన పట్ల చూపిస్తాయి. తాజాగా కేవలం ఒక ఐదు రూపాయలు విలువైన బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు విశ్వాసాన్ని చూపించిన కుక్క కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఐదు రూపాయల బిస్కెట్స్ పెట్టినందుకు కుక్క విశ్వాసం
ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ లో జరిగిన ఓ సంఘటనలో కొంతమంది హనుమాన్ దీక్ష పరులు కొండగట్టు అంజన్న క్షేత్రానికి పాదయాత్రను మొదలుపెట్టగా, వారికి దారిలో ఆకలితో ఉన్న ఒక శునకం కనిపించింది. దానికి వారు ఐదు రూపాయలు విలువైన బిస్కెట్ ప్యాకెట్ ను అందించారు. ఈ చిన్న సహాయాన్ని మరిచిపోని ఆ మూగ జీవి వారిని ఫాలో అవుతూ వెళ్ళింది.

130 కిలోమీటర్ల దూరం వారితో పాటు కుక్క పాదయాత్ర
ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా 130 కిలోమీటర్ల దూరం వారితోపాటు ఆ కుక్క కూడా పాదయాత్ర చేసింది. దీంతో అది అక్కడి వారందరి మనసులను గెలుచుకుంది.హనుమాన్ దీక్ష చేపట్టి పాదయాత్ర చేస్తున్న వారితో పాటు కుక్క కూడా అత్యంత కఠినమైన తారు రోడ్ల పైన ఎండలో నడిచింది. దీంతో దాని కాళ్ళకి పొక్కులు వచ్చాయి. తీవ్రమైన నొప్పితో నడవలేని స్థితికి చేరుకున్నా అది భక్తులను వదిలిపెట్టి వెళ్లడానికి మాత్రం నిరాకరించింది.
శునకం భక్తులకు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీలా
ఆకలిగా ఉన్న సమయంలో ఐదు రూపాయల బిస్కెట్లు వేసినందుకు అది చూపించిన విశ్వాసం వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా, రాత్రి సమయంలో అటవీ మార్గం గుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చినప్పుడు, ఈ శునకం భక్తులకు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీలా ముందు నడిచింది. క్రూర మృగాల భయం నేపథ్యంలో, ఆ మూగజీవి తన యజమానులను రక్షించడానికి తాను ముందుండి వారికి కొండంత ధైర్యాన్ని అందించింది.

హనుమాన్ భక్తులతో పాటు కొండగట్టుకు కుక్క
హత్నూర్ నుండి తమతో పాటు కుక్క కూడా కొండగట్టుకు పాదయాత్ర చేయడం హనుమాన్ భక్తులకు సంతోషాన్ని కలిగించింది. తమ మీద అపారమైన విశ్వాసాన్ని చూపించిన ఆ కుక్క తీరుకు సంతోషం వ్యక్తం చేశారు. దాని పట్ల కూడా అపారమైన ప్రేమను చూపారు. కుక్క కళ్ళకు గాయాలు కావడంతో దానికి సాక్స్ లు తొడిగి ప్రతిరోజు ఆహారం అందిస్తూ తమతో పాటు తీసుకువెళ్లారు.
ఆంజనేయ స్వామి పంపించిన దూతగా కుక్కను భావించిన హనుమాన్ భక్తులు
ఆ కుక్కని వారు ఒక జంతువుగా కాకుండా ఆంజనేయ స్వామి పంపించిన ఒక దూతగా చూసారు. అనునిత్యం కలిసిమెలిసి ఉండే మనమే ఒకరి మీద ఒకరు విశ్వాసం చూపించుకోలేని నేటి రోజుల్లో ఐదు రూపాయల బిస్కెట్లు పెట్టినందుకు కుక్క చూపిన విశ్వాసం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.












Click it and Unblock the Notifications