El Nino: తెలంగాణలో 75 ఏళ్ల రికార్డులు, 17 సార్లు ఏం జరిగిందంటే!
తెలంగాణపై ఈ ఏడాది సెప్టెంబరు నెలలో 'ఎల్‌నినో' తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపించనుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం దీని తీవ్రత సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ముందుముందు వానలు తగ్గుతాయన్న వార్త రైతాంగాన్ని కలవరపెడుతోంది. అయితే, ఎల్‌నినో వచ్చినంత మాత్రాన ప్రతిసారీ కరువు రావలసిన అవసరం లేదని, గత 75 ఏళ్ల వాతావరణ చరిత్రను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి.
భారతదేశంలో 1951 నుంచి 2025 వరకు గడిచిన ఏడేళ్లన్నర శతాబ్దకాలంలో మొత్తం 17 సార్లు ఎల్‌నినో పరిస్థితులు తలెత్తాయి. విశేషమేమిటంటే.. ఈ 17 సందర్భాలలో కేవలం 8 సార్లు మాత్రమే దేశవ్యాప్తంగా వర్షాభావం ఏర్పడి తీవ్ర కరువుకు దారితీసింది. అంటే సగానికి పైగా ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతం దెబ్బతినలేదు. ఇక తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే, ఆ 17 ఎల్‌నినో ఏళ్లలో కేవలం 5 సార్లు మాత్రమే తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది.

వర్షపాతం లెక్కల్లో ఆసక్తికర ఘట్టాలు
తొలిసారిగా 1951లో ఎల్‌నినో వచ్చినప్పుడు జూన్ నుంచి సెప్టెంబరు మధ్య దేశంలో వర్షపాతం 13.2 శాతం తగ్గగా, ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏకంగా 26.6 శాతం లోటు నమోదైంది. సరిగ్గా 2004లో కూడా సెప్టెంబరు నెలలో అదే స్థాయిలో వర్షపాతం పడిపోయింది. దేశంలో అత్యంత దారుణమైన ఎల్‌నినో కరువు 1972లో సంభవించింది; ఆ నాలుగు నెలల కాలంలో ఏకంగా 22.3 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. అయితే ఎల్‌నినో వచ్చినా వానలు సమృద్ధిగా కురిసిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు 1953, 1994లలో ఎల్‌నినో ఉన్నప్పటికీ, సాధారణం కంటే వరసగా 10.7 శాతం, 13.9 శాతం అధికంగా వర్షాలు పడటం గమనార్హం.
దేశానికి ఒకలా.. తెలంగాణకు మరోలా!
ఎల్‌నినో ప్రభావాన్ని పరిశీలిస్తే దేశసగటు వర్షపాతానికి, తెలంగాణ ప్రాంత వర్షపాతానికి అస్సలు పొంతన ఉండటం లేదు.
- 1965లో: దేశమంతటా 18.6 శాతం వర్షపాతం లోటు ఏర్పడి అల్లాడిపోతే, తెలంగాణలో మాత్రం సాధారణం కంటే 1.3 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి.
- 1994లో: దీనికి పూర్తిగా భిన్నంగా దేశమంతటా భాగా వర్షాలు కురిస్తే, తెలంగాణ ప్రాంతం మాత్రం 16.3 శాతం లోటు వర్షపాతాన్ని మూటగట్టుకుంది.
- 2004లో: దేశవ్యాప్తంగా 9.6 శాతం మాత్రమే లోటు ఉండగా, తెలంగాణలో మాత్రం ఏకంగా 35.7 శాతం వర్షపాతం పడిపోయి భయానక దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీన్ని బట్టి ఎల్‌నినో అనేది దేశవ్యాప్తంగా ఒకే రకమైన ప్రభావాన్ని చూపదని, తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి వాతావరణ సరళి భిన్నంగా ఉంటోందని స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications