Fact check: ఈటల రాజేందర్ ట్విట్టర్, ఫేస్ బుక్ బయో నుండి బీజేపీని తీసేశారా?
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ వ్యవహారం అధిష్టానం వద్ద చర్చనీయాంశం కాగా, ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత వారిద్దరూ పార్టీని వీడి వెళ్ళిపోతారా? అన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో రోజుకో కొత్త ప్రచారం ఆయనపై జరుగుతుంది.
ఈటల రాజేందర్ కు బండి సంజయ్ తో పడడం లేదని, ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ సాగుతుంది. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యత అప్పగిస్తారని భావించినా అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఈటల రాజేందర్ ఉన్నారని సమాచారం.

ఇక తాజా పరిణామాలు ఈటల రాజేందర్ కు పొమ్మనకుండానే పొగ పెట్టినట్టుగా మారాయని ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు లేకపోలేదని చర్చ జరుగుతుంది. అయితే ఆయన పార్టీ మారేది లేదని పదేపదే చెప్తున్నా ఆయనపైన పార్టీ మారతారన్న ప్రచారం జోరందుకుంది.
ఈటల రాజేందర్ కి చేరికలు కమిటీకి చైర్మన్ గా అవకాశం ఇస్తే ఆ బాధ్యతను నిర్వహించలేక చేతులెత్తేశారు. ఈటల రాజేందర్ హయాంలో బీజేపీలో చేరిన ముఖ్యనాయకులు లేరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసి ఈటల విఫలం అయ్యారు. దీంతో ఒక ఫెయిల్యూర్ లీడర్ గా ఈటల రాజేందర్ ను చూస్తున్న పరిస్థితి బిజెపి లో ఉంది.

బిజెపిలో కీలక బాధ్యతలు ఇవ్వకపోవడం, ఇటీవల కాలంలో అధిష్టానం ఈటల రాజేందర్ ను పెద్దగా పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసహనంతో ఉన్న ఈటల పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. అయితే ఈటల రాజేందర్ పార్టీ వీడి వెళ్లడం ఖాయమని రోజుకో రకమైన ప్రచారం జరుగుతుంది. బిజెపి కి ఆయన గుడ్ బై చెప్పబోతున్నారు చర్చ జరుగుతుంది

ఇక ఈ క్రమంలో తాజాగా ఆయన తన ట్విట్టర్, ఫేస్ బుక్ బయో నుండి బిజెపిని తొలగించారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అలాంటిదేమీ లేదని ఈటల రాజేందర్ అనుచరులు ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను వాట్సాప్ గ్రూపు లలో పెట్టి కావాలనే ఈటల రాజేందర్ పై దుష్ప్రచారం జరుగుతుందని ఎవరు నమ్మొద్దని చెబుతున్నారు. ఎందుకు ఈటల రాజేందర్ పై ఈ విధమైన ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచార పర్యవసానం ఏమవుతుంది అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications