Singireddy Niranjan Reddy: శవాన్ని పిలిచిన మాజీ మంత్రి… అద్భుతం జరిగిపోయింది!
Singireddy Niranjan Reddy: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయాడని అందరూ భావించిన ఓ వ్యక్తి.. తన ఛాతిపై ఉన్న పచ్చబొట్టు కారణంగా తిరిగి ప్రాణాలు నిలుపుకున్న ఘటన సంచలనం రేపింది. వనపర్తి జిల్లా, పీర్లగుట్ట గ్రామానికి చెందిన తైలం రమేష్ (49) అనారోగ్యం కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రమేష్‌కు ఊపిరి ఆడకపోవడం, శరీరం చలనం లేకుండా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు అతడు మరణించాడని నిర్ధారించుకున్నారు. దీంతో వారు అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. బంధుమిత్రులు అంతా విషాదంలో మునిగిపోయారు.
అభిమానమే ప్రాణం పోసింది..
రమేష్ మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వీరాభిమాని. ఆయనపై ఉన్న అపారమైన అభిమానంతో తన ఛాతీపై నిరంజన్ రెడ్డి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన నిరంజన్ రెడ్డి, రమేష్‌కు నివాళులు అర్పించేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ పూలమాల వేయబోతున్న సమయంలో, రమేష్ కుటుంబ సభ్యులు అతడి ఛాతీపై ఉన్న పచ్చబొట్టును చూపించారు.

పచ్చబొట్టును దగ్గరగా పరిశీలించడానికి నిరంజన్ రెడ్డి వంగినప్పుడు, రమేష్‌లో స్వల్పంగా కదలికలు గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన.. రమేష్‌పై ఉన్న పూలమాలలు, పూలను తొలగించారు. ఆ తర్వాత రమేష్.. రమేష్ అంటూ పేరు పెట్టి గట్టిగా పిలవగా, అతడి కనురెప్పలు కదిలాయి. రమేష్ బతికే ఉన్నాడని గ్రహించిన నిరంజన్ రెడ్డి.. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల సహాయంతో కోలుకున్న రమేష్
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు రమేష్‌కు చికిత్స అందించారు. గంటలోపే అతడు సాధారణ స్థితికి చేరుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. సరైన సమయంలో స్పందించి రమేష్ ప్రాణాలు కాపాడినందుకు వారు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తైలం రమేష్ తెలంగాణ ఉద్యమకారుడు కూడా. ఉద్యమ సమయం నుంచే నిరంజన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిరంజన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తన ఛాతీపై ఆయన చిత్రాన్ని పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న తైలం రమేష్.. 3 రోజుల క్రితమే వనపర్తిలోని తన బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications