శుభవార్త.. తెలుగు రాష్ట్రాలకు 5,500పైగా స్పెషల్ బస్సులు!
తెలుగు రాష్ట్రాలలో అప్పుడే సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ. ఎంతో ప్రాధాన్యత కలిగిన వేడుక సంక్రాంతి. అటువంటి సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లంతా సొంత ఊర్లకు చేరుకుంటారు. తమ వారందరితోనూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు
సంక్రాంతి పండుగకు ప్రజల ప్రయాణ కష్టాలు తొలగించడం కోసం rtc, రైల్వే, అదనపు బస్సులను, రైళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అనేక జిల్లాలకు 5,500కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

జనవరి 9వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు
తెలంగాణ జిల్లాలకు మూడు రోజుల్లో 2500కు పైగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 3000 వరకు ప్రత్యేక బస్సులను కేటాయిస్తోంది. ఈ సంక్రాంతి ప్రత్యేక బస్సులు వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని టిజిఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జనవరి 9వ తేదీ నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు
ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ముందస్తు రిజర్వేషన్లకు వెళ్ళగానే పెద్ద సంఖ్యలో బస్సులను సిద్ధం చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం, రాజమండ్రి, గుంటూరు, చీరాల, విజయవాడ వంటి ప్రాంతాలకు నడుపుతున్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
బస్సుల సంఖ్యను పెంచడానికి ఆర్టీసీ రెడీ
ఆర్టీసీ వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని కూడా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అంటే ప్రయాణాల హడావిడి ఎక్కువగా ఉంటున్న సందర్భంలో మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడానికి ఆర్టీసీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications