పోలీసు ఉద్యోగాల నియామకం పై బిగ్ అప్డేట్ - తాజా నిర్ణయంతో..!!
నిరుద్యోగులకు శుభవార్త. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే భర్తీ దిశ గా కసరత్తు మొదలైంది. ఈ సారి భారీ ఎత్తున నియామకాలు చేసేందుకు ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఆమోదం తెలపగానే నోటిఫికేషన్ జారీ కానుంది. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నా.. దశల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దీంతో, ముందుగా భర్తీ చేయాల్సిన పోస్టుల పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ద్వారా భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
నోటిఫికేషన్
తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు కసరత్తు మొదలైంది. దాదాపు 12 వేల వరకు ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వం కొంతకాలంగా పోలీసుశాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో లుంబినీపార్కు, గోకుల్‌చాట్ వద్ద బాంబు పేలుళ్ల సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35 వేల పోలీసు నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాకపోవటంతో విడతల వారీగా నియామకం కొనసాగుతోంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ అప్పుడప్పుడు వాయిదా పడుతోంది.

కసరత్తు
కాగా, కొత్తగా మంజూరైన పోస్టుల నియామక ప్రక్రియ చివరి విడత 2022 లో పూర్తయింది. అప్పుడు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు 17 వేల పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సై, కానిస్టేబుల్స్‌కు 2024లో సీఎం రేవంత్ నియామకపత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో పోలీసు నియమకాల భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ప్రస్తుత సంవత్సరం పదవీ విరమణలతో ఇంకాస్త పెరిగే అవకాశముంది.
తాజా ఖాళీలతో
ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచటంతో 2021లో పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications