New Year 2024 celebrations: తెలంగాణలో పోలీసుల ఆంక్షలు ఇవే..!!
Happy New year 2024: ఇంకొద్ది రోజుల్లో 2023వ సంవత్సరం.. చరిత్రలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి హైదరాబాద్ సిద్ధపడుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో పార్టీ హాల్స్ అన్నీ బుక్ అయ్యాయి. ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకోవడానికి నగర యువత సమాయాత్తమౌతోంది.
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి సన్నాహాలు చేపట్టింది. కొత్త ఏడాది వేడుకల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపైనా నిఘా ఉంచింది.

ఇందులో భాగంగా- రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు.. మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫామ్ హౌస్, ఈవెంట్ ఆర్గనైజర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు కీలక ఆదేశాలను జారీ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సూచించారు. ట్రాఫిక్, షీ-టీమ్స్, పెట్రోలింగ్.. ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామని అన్నారు.
అవుట్- డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, బాణాసంచాను కాల్చడానికీ అనుమతి ఇవ్వట్లేదని సుధీర్ బాబు స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆదేశించారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి షీ-టీమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారని, నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతామనీ కమిషనర్ హెచ్చరించారు. పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగర శివార్లల్లో ఉండే ఫామ్ హౌస్‌లల్లో ఏర్పాటు చేసే సెలబ్రేషన్లన్నీ కూడా నిబంధనలకు లోబడి ఉండాలని, డ్రగ్స్ వినియోగం గానీ, అసభ్యకరంగా డాన్స్ ప్రోగ్రామ్‌లను నిర్వహించితే కఠిన చర్యలు ఉంటాయని సుధీర్ బాబు తేల్చి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారు, మైనర్లకు వాహనాలు ఇచ్చేవారు, బైక్ రేసర్లపై నిఘా ఉంచుతామని అన్నారు.












Click it and Unblock the Notifications