రేవంత్! పారిపోయే చరిత్ర నీది: రాజీనామాపై హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్
రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు.. ఇప్పుడు ఆ పని చేయమంటే పారిపోతారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. ఈ మేరకు గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
'సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
రేవంత్ రెడ్డి, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది' అంటూ హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

'పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది.
నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను' అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
అంతేగాక, 'మరోసారి చెబుతున్నా.. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు (అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..? ' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు.
సిఎం రేవంత్ రెడ్డి గారూ!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 18, 2024
తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు.
👉రేవంత్ రెడ్డి గారు, నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన… pic.twitter.com/mghX3v2TES
రేవంత్ ఏమన్నారంటే..
కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిందని.. దానికి వడ్డీగా నెలకు రూ. 7వేల కోట్లు తమ ప్రభుత్వం కడుతోందని సీఎం రేవంత్ తెలిపారు. తాము రైతు రుణమాఫీ చేస్తామన్న మాట నిలబెట్టుకున్నామని.. అయితే, రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరిన వారిని రాజీనామా చేయమని అడగమని.. ఎందుకంటే వారు పారిపోతారని మాజీ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి రేవంత్ చురకలంటించారు.












Click it and Unblock the Notifications